దిశా సాలియన్‌ మృతి కేసు : సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ఉద్ధవ్ థాక్రే, ఆదిత్య థాక్రే, అనిల్ దేశ్‌ముఖ్ పేర్లు

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బొంబాయి హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు విచారణను చేపట్టిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సోమవారం ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్‍లో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ థాక్రే, ఆయన కుమారుడు మాజీ మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే, ఆయన బాడీగార్డ్స్, నటులు డినో మోరియా, రియా చక్రవర్తి, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్, మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే, డీసీపీ విశాల్ ఠాకూర్, మాల్వాని పోలీస్ స్టేషన్ సిబ్బంది, పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు, కలీనా ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ సిబ్బంది, దిశా నివసించిన బిల్డింగ్ సెక్యూరిటీ గార్డుల పేర్లను దర్యాప్తు అవసరమైన వ్యక్తుల జాబితాలో చేర్చినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. దిశా సాలియాన్ మృతికి సంబంధించిన అసలు నేరం, నేరపూరిత కుట్ర, ఆమెది ఆత్మహత్య అంటూ ప్రచారం చేసిన అసత్య కథనాలు, ఆధారాల తొక్కిపెట్టడం, ధ్వంసం చేయడం వంటి అంశాలపై వీరి పాత్రను విచారించాల్సిన అవసరం ఉందని సీబీఐ స్పష్టం చేసింది. కాగా దిశా సాలియన్‌ 2020 జూన్ 8న ముంబైలోని ఓ భవనం నుంచి కిందపడటంతో మృతి చెందారు. ఆమె మృతికి కొద్ది రోజులకే నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో మృతి చెందారు. దిశా సాలియన్‌ మృతిని అప్పట్లో యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ (ఏడీఆర్)గా నమోదు చేశారు. అయితే దిశాను హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపణలు చేయడంతో ఈ అంశం రాజకీయంగానూ, ప్రజల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు గత విచారణ సందర్భంగా కేవలం ఏడీఆర్ మాత్రమే నమోదు చేయడంపై ప్రశ్నలు లేవనెత్తింది. దిశా సాలియన్‌ మృతి జరిగి ఐదేళ్లు గడిచినా ఆమె కుటుంబానికి పోస్టుమార్టం నివేదిక, ఏడీఆర్ కాపీలు ఇవ్వకపోవడంపైనా కోర్టు ప్రశ్నలు సంధించింది. అనంతరం కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం