21 కిలోల ఎండు గంజాయి స్వాధీనం : నలుగురు అరెస్ట్, రూ. 25వేల నగదును స్వాధీనం
హై దరాబాద్ నగరంలో ఎండు గంజాయిని విక్రయిస్తున్న నలుగురు సభ్యులు గల ముఠాను హబీబ్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 21 కిలోల గంజాయిని, రూ. 25వేల నగదును స్వాధీనం చేసుకున్నామని ఆసిఫ్‌నగర్ డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కె శ్రీనివాస్ వెల్లడించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశామని వివరించారు. మహారాష్ట్రకు చెందిన సందీప్ నంద కిషోర్, రాహుల్ రాజేశ్ పాటిల్ అనే ఇద్దరు యువకులు మహారాష్ట్రలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌లోని మంగల్‌బస్తీకి చెందిన కాంబ్లె ఉమేశ్, కాంబ్లె సూరజ్‌కు అధిక ధరకు విక్రయిస్తున్నారని తెలిపారు. అందిన పక్కా సమాచారం మేరకు హబీబ్‌నగర్‌లో నిఘా పెట్టి గంజాయిని విక్రయిస్తుండగా నలుగురిని పట్టుకున్నామని పేర్కొన్నారు. వీరిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, అయితే దర్యాప్తులో నిందితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. గంజాయి ముఠాను పట్టుకోవడంలో కృషి చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించారు.