వియత్నాంతో భారత్ చారిత్రక మైత్రి !
భా రత ప్రధాని నరేంద్ర మోడీ, వియత్నాం అధ్యక్షుడు టో లామ్ మధ్య బుధవారం జరిగిన భేటీ రెండు దేశాల దౌత్య సంబంధాలలో ఒక మైలురాయిగా నిలిచింది. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను "మెరుగైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా" నవీకరించినట్లు ప్రధాని మోడీ అధికారికంగా ప్రకటించారు. వియత్నాంను భారతదేశపు "యాక్ట్ ఈస్ట్" విధానానికి మరియు "విజన్ మహాసాగర్"కు ఒక కీలకమైన స్తంభంగా ఆయన అభివర్ణించారు. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన అంశం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని భారీగా పెంచడం. 2030 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్య పరిమాణాన్ని 25 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 2.1 లక్షల కోట్లు) చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని వెల్లడించారు. దీని కోసం మార్కెట్ ప్రాప్యతను సులభతరం చేస్తూ పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ముఖ్యంగా వియత్నాంలో భారతీయ మందుల లభ్యతను పెంచేందుకు రెండు దేశాల ఔషధ నియంత్రణ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అలాగే వ్యవసాయం, మత్స్య , పశుసంవర్ధక ఉత్పత్తుల ఎగుమతిని సరళతరం చేయాలని నిర్ణయించారు. వియత్నాం అధ్యక్షుడు టో లామ్ తన భారత పర్యటనను బీహార్‌లోని బోధ్‌గయ నుంచి ప్రారంభించడంపై ప్రధాని మ...