About LATEST NEWS AP TO TG

Telugu computer tutorials Unicode to Anu conversion smartphone tips Telugu Use smartwatch tips Telugu EV news Telugu tech upd

Manual Description Here: Ea eam labores imperdiet, apeirian democritum ei nam, doming neglegentur ad vis.

3
Showing posts with label Andhra Pradesh. Show all posts
Showing posts with label Andhra Pradesh. Show all posts

విశాఖ బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన ఐదుగురు స్నేహితులు : ముగ్గుర్ని రక్షించిన లైప్ గార్డ్స్, ఇద్దరు గల్లంతు

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ పరిసరాల్లో ఉన్న గోకుల్ పార్క్ బీచ్ వద్ద సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన ఐదుగురు స్నేహితులను మృత్యు కెరటాలు ముంచెత్తాయి. పరవాడ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు కలిసి సముద్రంలోకి స్నానానికి దిగగా, ఒక్కసారిగా ఎగిసిపడిన అలలు వారిని లోపలికి లాక్కెళ్లాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన జీవీఎంసీ లైఫ్ గార్డులు వెంటనే స్పందించి ముగ్గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. గాలింపు చర్యల్లో మరొకరి మృతదేహం లభించగా, ఆచూకీ లభించని ఐదో వ్యక్తి కోసం పోలీసులు, మెరైన్ సిబ్బంది, గజ ఈతగాళ్లు సముద్రంలో తీవ్రంగా గాలిస్తున్నారు. తీరంలో సముద్రం ప్రశాంతంగా కనిపించినా అలల ఉద్ధృతిని అంచనా వేయడం కష్టమని అధికారులు తెలిపారు. ప్రమాదకర ప్రాంతాల్లో అధికారుల హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తూ సముద్రంలో స్నానాలకు దిగవద్దని పోలీసులు, జీవీఎంసీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Read More...

3 ఓట్ల తేడాతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి : కౌంటింగ్ ప్రధాన గేటు ముందు బైఠాయించి ఆందోళనకు దిగిన రోజా

ఆంధ్రప్రదేశ్ లోని పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌లో నగరి నియోజకవర్గ పరిధిలోని విజయపురం మండలం ఇల్లత్తూరు ఎంపీటీసీ స్థానం ఫలితం రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెజార్టీ 10 ఓట్లతో విజయం సాధించారని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఎన్నికల అధికారులు మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 3 ఓట్లతో గెలుపొందినట్లు ప్రకటించడంతో వివాదం రాజుకుంది. నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రం లోపల, వెలుపల ఈ పరిణామం తీవ్ర వాదోపవాదాలకు, ఘర్షణ వాతావరణానికి వేదికైంది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి తమ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారని, అయితే అధికార పక్షం ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు కావాలనే తప్పుడు ఫలితాన్ని వెల్లడించారని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రశ్నించిన తమ అభ్యర్థిని, కౌంటింగ్ ఏజెంట్లను పోలీసులు దౌర్జన్యంగా కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు నెట్టివేశారని నగరి వైసీపీ ఇంచార్జ్ రోజా ఆరోపించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, స్థానిక వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా హుటాహుటిన నగరి కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని, పార్టీ శ్రేణులతో కలిసి ప్రధాన గేటు ముందే బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ నిరసన సందర్భంగా రోజా తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పును అధికార కూటమి యంత్రాంగం కాలరాస్తోందని, నిబంధనలకు విరుద్ధంగా గెలిచిన అభ్యర్థిని ఓడించి.. ఓడిన టీడీపీ అభ్యర్థిని గెలిపించారని ఆమె అధికారులపై మండిపడ్డారు. రీకౌంటింగ్ నిర్వహించి పూర్తి పారదర్శకతతో ఫలితాన్ని పునఃసమీక్షించేంత వరకు కదిలేది లేదంటూ బైఠాయించడంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బందోబస్తు మోహరించింది. అధికారులు, పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమావళి ప్రకారమే సీసీ కెమెరాల నిఘాలో, ఇరు పక్షాల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిష్పాక్షికంగా జరిగిందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. కౌంటింగ్ పూర్తయిన తర్వాత చట్టబద్ధంగా ఆధిక్యం సాధించిన అభ్యర్థికే ధ్రువీకరణ పత్రం అందజేశామని తెలిపారు. తర్వాత రోజా పోలీస్ డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తూ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.

Read More...

రాప్తాడు పాఠశాల విద్యార్థినిపై జరిగిన దాడి ఘటన : రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర విచారణ జరిపి నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, అనంతపురం జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులకు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్‌పర్సన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి ఈ ఆదేశాలు ఇచ్చారు. ఈ ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. విద్యార్థులు చదువుకునే పాఠశాలల్లోకి బయటి వ్యక్తులు ఆయుధాలతో ప్రవేశించి దాడులకు పాల్పడటం విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సుమోటోగా కేసు నమోదు చేసి సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది.


Read More...

లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టు, నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ సీఎం వైయస్ జగన్ ట్వీట్‌

వైయస్సార్‌సీపీ శాసనమండలి సభ్యుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టు, నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు. ఎన్నికల అక్రమాలను ప్రశ్నిస్తూ పార్టీ అభ్యర్థులతో, ప్రజలతో కలిసి శాంతియుతంగా ఆందోళన చేస్తే, దానిపై తప్పుడు కేసులు పెట్టి, అడ్డగోలుగా అరెస్టు చేసి, నిర్బంధానికి గురిచేయడం దుర్మార్గమన్నారు. ఎమర్జెన్సీని తలపించే ఈ పాలన అత్యంత హేయమంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. గుంటూరు రూరల్‌ మండలం వెంగళాయపాలెంలో గురువారం పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత, నేరుగా నాగార్జున వర్శిటీకి చేరాల్సిన బ్యాలెట్‌ బాక్సులను మధ్యలో నల్లపాడు వద్ద ఎందుకు దింపారు? అని జగన్ ప్రశ్నించారు. ఎవరి ఆదేశాలమేరకు ఆ బ్యాలెట్ బాక్సులను దింపారు? అసలు బ్యాలెట్‌ బాక్సులకు ఉండాల్సిన భద్రత ఏమైంది? అని నిలదీశారు. స్ట్రాంగ్‌ రూంకు చేరాల్సిన బ్యాలెట్‌ బాక్సులు నడిరోడ్డుమీద కనిపిస్తే, కళ్లెదుటే వాటిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలమీద లాఠీఛార్జి చేస్తారా? తప్పులు మీరుచేసి, ఏకంగా బ్యాలెట్‌ బాక్సులు మార్చే ప్రయత్నంచేసి, మళ్లీ మావాళ్లపై అక్రమకేసులా? చివరకు ఒక ఎమ్మెల్సీమీద డెకాయిటీ, దొంగతనం కేసులుకూడా పెడతారా? ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? అని జగన్ మండిపడ్డారు. “ఈ స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు రిగ్గింగ్‌, నామినేషన్ల స్క్రూట్నీ రిగ్గింగ్‌, పోలింగ్‌ బూత్‌ల రిగ్గింగ్‌, పోలింగ్‌ సైక్లింగ్‌, పోలింగ్‌ పర్సంటేజీల రిగ్గింగ్, చివరకు పోలింగ్‌ ముగిశాక ఇలా బ్యాలెట్‌ బాక్సులు కూడా రిగ్గింగ్? చంద్రబాబుగారూ ఈ స్థానిక ఎన్నికల్లో మీరు ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తుంటే, ఈ తప్పుల్ని ఎవరైనా ప్రశ్నిస్తే, వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతారా? @ncbn గారూ మీ అధికార, పోలీసు బలాన్ని ప్రయోగించి కట్టడిచేయాలని అనుకున్నంత మాత్రాన, మీరు చేసిన ఎన్నికల అక్రమాలు దాచిపెట్టలేరు. మీ అప్రజాస్వామిక పద్ధతులను దేశమంతా చూస్తూనే ఉంది. ప్రజలు చూస్తూ ఊరుకోరు, ఇలాంటి దుర్మార్గాలను సహించరు, మీకు తగిన బుద్ధిచెప్తారు.” అని ట్వీట్‌లో మాజీ సీఎం జగన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read More...

బంగాళాఖాతంలో 13న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం : వాతావరణ శాఖ వెల్లడి

బంగాళాఖాతంలో 13న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, అది పశ్చిమ వాయవ్యంగా పయనించి 15 నాటికి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే తూర్పు తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలపై గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగు తోంది. ప్రస్తుతం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆవర్తన ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. అయితే ఈ వాయుగుండం బలపడు తుందా, తమిళనాడు తీరం దిశగా వస్తుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే వాయు గుండం గా బలపడిన తర్వాత నైరుతి బంగాళాఖాతంలోకి వచ్చే సమయంలో తమిళనాడు, ఏపీ లోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. శనివారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నవంబర్ 12 నుండి 18 వరకు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ రోజు నుంచి కోస్తాంధ్ర - రాయలసీమ: అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించారు. అదే విధంగా తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై ఉండి, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఈదురుగాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది.
Read More...

చీరాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పది వార్డుల గెలుచుకున్న కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్ లోని చీరాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పది వార్డులను గెలుచుకుని, రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. వైఎస్సార్‌సీ ఎనిమిది సీట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. దశాబ్దానికి పైగా చెప్పుకోదగ్గ ఎన్నికల విజయం లేకుండా గడిచిన కాంగ్రెస్‌కు, ఈ ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌లో పునరాగమనాన్ని సూచిస్తున్నాయి. తెలుగుదేశం మున్సిపాలిటీపై తన పట్టును నిలుపుకుంది. తెలుగుదేశం పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి ఎరిచర్ల హనీ స్పందన, తన సమీప ప్రత్యర్థిపై 6,408 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొత్తం 44 వార్డులకు గాను తెలుగుదేశం 22 వార్డులను గెలుచుకోగా, దాని మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలు వరుసగా రెండు, ఒక సీటును కైవసం చేసుకున్నాయి. దీంతో కూటమి సీట్ల సంఖ్య 25కు చేరింది. కాంగ్రెస్ 10 వార్డులను గెలుచుకోగా, ఒక స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డును దక్కించుకున్నారు. 2014 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తిరిగి పట్టు సాధించేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాల మధ్య ఈ ప్రదర్శన చోటుచేసుకుంది. కాంగ్రెస్ మెరుగైన పనితీరుకు మాజీ ఎమ్మెల్యే అమాంచి కృష్ణ మోహన్ ప్రజలతో తిరిగి మమేకమవ్వడమే కారణమని స్థానికులు పేర్కొన్నారు. బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు, గంటకు దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో, వాస్తవానికి అంతకుముందే జరగాల్సిన ఓట్ల లెక్కింపును నవంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు. భద్రతాపరమైన ఆందోళనలు, వర్షపు నీటి వల్ల బ్యాలెట్ పెట్టెలు, ఎన్నికల రికార్డులు దెబ్బతినే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అప్రమత్తం చేశారు. అనంతరం, శుక్రవారమే ఓట్ల లెక్కింపు జరపాలని ఎస్ఈసీ ఆదేశించింది.

Read More...

'అర్నబ్‌' తుఫానులో కొట్టుకుపోయిన పడవల వెలితీతకు ముందుకొచ్చిన రిలయన్స్ ఫౌండేషన్ : పది వేల మంది మత్స్యకారులకు లబ్ధి

ఆంధ్రప్రదేశ్‌లో 'అర్నబ్‌' తుఫాను సృష్టించిన విధ్వంసానికి నష్టపోయిన మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ అండగా నిలిచింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తుఫాను వల్ల కొట్టుకుపోయిన 180కి పైగా పడవలను వెలికితీసేందుకు, అలాగే మత్స్యకార కుటుంబాల జీవనోపాధికి మద్దతుగా ఒక సమన్వయ కార్యక్రమాన్ని చేపడుతోంది. తుఫాను కారణంగా కోనసీమ జిల్లాలోని ఓడలరేవు, సఖినేటిపల్లి ల్యాండింగ్ కేంద్రాల్లోని మత్స్యకార వర్గాల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింది. అనేక చేపల వేట పడవలు పేరుకుపోయిన బురదలో చిక్కుకుపోయి, పాక్షికంగా లేదా పూర్తిగా మునిగిపోయాయి. కొన్ని పడవలు ఒకచోట నుండి మరొకచోటికి కొట్టుకుపోగా, మరికొన్ని ఒకదానిపై ఒకటి పడిపోయాయి. రిలయన్స్ ఫౌండేషన్ బృందాలు ఇక్కడ క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, తమ "వి కేర్" చొరవకు అనుగుణంగా, తక్షణమే స్పందిస్తూ భారీ యంత్రాల సహాయంతో పడవలను వెలికితీసే కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. అల్లావరం మండలంలోని ఓడలరేవు, సఖినేటిపల్లి ఫిషింగ్ ల్యాండింగ్ కేంద్రాల్లో ప్రాథమిక అంచనా ప్రకారం.. ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు 186 చేపల వేట పడవలు తమ లంగరు స్థానాల నుండి కొట్టుకుపోయి కాలువలు, బురద ప్రాంతాలు, సమీప ల్యాండింగ్ స్థలాలలో చిక్కుకున్నాయి. వీటిలో కొన్ని పాక్షికంగా మునిగిపోవడం లేదా ఒండ్రులో ఇరుక్కుపోవడంతో చేతులతో వెలికితీయడం కష్టంగా, ప్రమాదకరంగా మారింది. సుమారు 5 నుండి 10 టన్నుల బరువున్న ఈ పడవలు ప్రస్తుతం దారి సరిగ్గా లేని, బురద పేరుకుపోయిన ప్రమాదకర ప్రాంతాలలో ఉన్నాయి. వీటిని భారీ క్రేన్లు, యంత్రాల ద్వారా వెలికితీసి, యథాస్థానానికి చేర్చేందుకు స్థానిక మత్స్య శాఖ అధికారులతో కలిసి రిలయన్స్ ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఈ బృందం స్థానిక మత్స్యకారులతో కలిసి పడవలను గుర్తించి, వాటి లొకేషన్లను నిర్ధారించుకుని, సురక్షితమైన పరిధిలో క్రేన్ ఆపరేటర్ల సహాయంతో ఒక ప్రణాళికాబద్ధంగా పడవలను వెలికితీసే పనిని చేపడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతంలోని సుమారు 10,000 మంది మత్స్యకారుల జీవనోపాధికి నేరుగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుంది.

Read More...

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పొన్నూరు యువకుడు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన తెలుగు యువకుడు అమెరికాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఉన్నత చదువులు పూర్తి చేసి, ఉద్యోగంలో స్థిరపడి జీవితంలో ఎదుగుతున్న తరుణంలో ఈ అకాల మరణం సంభవించడం పట్ల స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. పొన్నూరు పట్టణంలోని 17వ వార్డు నేతాజీనగర్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు, దివంగత కొమ్మినేని శేషగిరిరావు మనవడైన ఆకాశ్ (26) ఈ దుర్ఘటనలో మృతి చెందాడు. శేషగిరిరావు పెద్ద కుమారుడు కల్యాణ చక్రవర్తి, పద్మ దంపతులు ఎన్నో ఏళ్ల కిందటే అమెరికాలో స్థిరపడ్డారు. వీరి పెద్ద కుమారుడైన ఆకాశ్, ఇటీవలే తన విద్యాభ్యాసాన్ని ముగించుకుని ఒక ప్రముఖ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. నవంబరు 1వ తేదీన అట్లాంటా సమీపంలో ఆకాశ్ ప్రయాణిస్తున్న కారును వెనుక వైపు నుంచి వచ్చిన ఒక భారీ ట్రక్కు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయి క్షణాల వ్యవధిలోనే మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో ఆకాశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటనపై స్థానిక అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More...

అసైన్డ్ భూముల వారసుల పేరిట రిజిస్ట్రేషన్లు, హక్కుల మార్పిడిని సులభతరం చేస్తూ రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నుంచి పొందిన అసైన్డ్ భూములకు సంబంధించి ఒరిజినల్ లబ్ధిదారుల చట్టబద్ధమైన వారసుల పేరిట రిజిస్ట్రేషన్లు, హక్కుల మార్పిడిని సులభతరం చేస్తూ రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2026 జులై మాసంలోనే రెవెన్యూ శాఖ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడమే కాకుండా, సదరు నూతన విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలులోకి తెచ్చింది. గతంలో వారసత్వ హక్కుల నమోదు కోసం ఎదుర్కొంటున్న సుదీర్ఘ రెవెన్యూ ప్రక్రియలు, ఆలస్యాలకు స్వస్తి పలికి, కేవలం నామమాత్రపు రుసుముతోనే ఈ సేవలను పారదర్శకంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా లక్షలాది మంది నిరుపేద అసైనీ కుటుంబాలకు కొండంత ఊరట లభించింది. నూతన నిబంధనల ప్రకారం అసైన్డ్ భూమిని తమ పేరుతో మార్చుకోవాలనుకునే ఒరిజినల్ అసైనీ వారసులు, గ్రామ సచివాలయాల్లో సుదీర్ఘంగా వేచి చూడాల్సిన వారసత్వ మ్యుటేషన్ దరఖాస్తు విధానాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. దానికి బదులుగా, కుటుంబ సభ్యులందరూ కలిసి రాసుకున్న భాగ పరిష్కార పత్రాల ఆధారంగా నేరుగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఆస్తి విలువ రూ.10 లక్షలలోపు ఉంటే కేవలం రూ.100, రూ.10 లక్షల కంటే ఎక్కువ ఉంటే రూ.1,000 చొప్పున స్టాంప్ డ్యూటీ చెల్లిస్తే సరిపోతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఆటోమేటిక్‌గా 'మ్యుటేషన్' కూడా పూర్తయ్యేలా రెవెన్యూ రికార్డులను ఐజీఆర్‌ఎస్, వెబ్‌ల్యాండ్ నెట్‌వర్క్‌తో అనుసంధానించారు. ఈ రిజిస్ట్రేషన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అసైనీ వారసులు కొన్ని నిర్దిష్టమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.భూమి అసలు యజమాని మరణించినట్లు ధ్రువీకరించే డెత్ సర్టిఫికేట్ తో పాటు, సదరు వ్యక్తికి వీరే చట్టబద్ధమైన వారసులని స్పష్టం చేసే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తప్పనిసరి. వీటితో పాటు కుదుర్చుకున్న భాగ పరిష్కార పత్రాన్ని జతచేసి సబ్‌రిజిస్ట్రార్‌ వద్ద సమర్పిస్తే, అధిక అధికారుల చుట్టూ తిరిగే పనిలేకుండా త్వరితగతిన వారసుల పేరిట రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు జారీ అవుతాయి. ఈ నిర్ణయంతో దశాబ్దాలుగా తమ తండ్రులు లేదా తాతల పేరిట ఉన్న అసైన్డ్ భూములను తమ సొంత పేర్లతో మార్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడిన పేద రికార్డుదారులకు శాశ్వత ఉపశమనం లభించింది. వారసుల పేరిట రిజిస్ట్రేషన్ సులభతరం కావడం వల్ల రైతులకు బ్యాంకు రుణాలు పొందడం, పంట నష్టపరిహారం అందుకోవడం, అలాగే చట్టబద్ధమైన హక్కులు పొందడం ఎంతో సులువవుతుంది. పాత పద్ధతులకు తిలోదకాలు ఇస్తూ రెవెన్యూ శాఖ తీసుకొచ్చిన ఈ మార్పు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ,పట్టణ ప్రాంతాలలో ఉన్న అసైన్డ్ భూముల హక్కుదారుల్లో సంతోషాన్ని నింపింది.

Read More...

భారత్‌-శ్రీలంక తొలి వన్డే : ఢిల్లీ నుంచి విశాఖకు వేదిక మార్పు

భారత్, శ్రీలంక జట్ల మధ్య డిసెంబర్ 13న జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ వేదిక మారింది. తొలుత ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ తాజాగా విశాఖపట్నానికి మార్చినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఢిల్లీ క్రికెట్ సంఘం చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఢిల్లీలో వాతావరణ పరిస్థితుల కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో పాటు.. స్టేడియంలో మరమ్మతులు, పునరుద్ధరణ పనులు కొనసాగుతుండటమే వేదిక మార్పునకు కారణమని తెలిపింది. దీంతో డిసెంబర్ 13న జరగనున్న తొలి వన్డేకు విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ సిరీస్‌లో రెండో వన్డే బెంగళూరులో, చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనున్నాయి.

Read More...

సముద్రపు అలల ధాటికి కొట్టుకొచ్చిన పడవలో నాలుగు మృతదేహాలు లభ్యం!

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుల బోటు ప్రమాదానికి గురైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సముద్రపు అలల ధాటికి కొట్టుకొచ్చిన పడవలో నాలుగు మృతదేహాలు కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. కొత్తపట్నం తీరానికి చేరుకున్న బోటును స్థానిక మత్స్యకారులు గుర్తించారు. అందులో నాలుగు మృతదేహాలు ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు, మెరైన్ అధికారులకు సమాచారం అందించారు. సముద్రంలో అలల ఉధృతి కారణంగా బోటు అదుపుతప్పి బోల్తా పడి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. సదరు బోటులో మొత్తం 15 మందికి పైగా మత్స్యకారులు ఉన్నట్లు భావిస్తున్నారు. పడవలో నలుగురి మృతదేహాలు మాత్రమే లభించడంతో మిగిలినవారు సముద్రంలో గల్లంతై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి గురైన వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న కొత్తపట్నం పోలీసులు, మెరైన్ అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని బోటును పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. మృతుల వివరాలు, వారి స్వస్థలాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. వీరు తమిళనాడుకు చెందిన మత్స్యకారులా ? లేక స్థానిక తీరప్రాంత గ్రామాల వారా ? అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. మరోవైపు గల్లంతైన వారి ఆచూకీ కోసం మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్ బృందాలు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టాయి. నౌకలు, స్థానిక మత్స్యకారుల పడవల సహాయంతో అన్వేషణ కొనసాగిస్తున్నారు. బోటు సముద్రంలో అలల ఉధృతికి అదుపుతప్పిందా? లేదా ఏదైనా భారీ నౌక ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగిందా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది విచారణ పూర్తయిన తర్వాత స్పష్టమయ్యే అవకాశం ఉంది. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Read More...

భూ ఆక్రమణ కేసులో లేడీ డాన్ కోనేటి సులోచన సహా ముగ్గురి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నకిలీ పత్రాలు సృష్టించి విలువైన భూమిని కబ్జా చేశారనే ఆరోపణలపై రౌడీషీటర్ కోనేటి సులోచన సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పీటీ వారెంట్‌పై వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మదనపల్లెకు చెందిన మార్పూరి శ్రీరామ్‌కు సంబంధించిన భూమిని ఆయన పెద్దనాన్న కుమారుడు మార్పూరి వెంకటేష్ 2023లోనే రాసిచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆ పత్రాల ఆధారంగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నిందితులు సదరు భూమిలోకి ప్రవేశించి, అక్కడి ఆస్తులను ధ్వంసం చేసి స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇతర కేసులకు సంబంధించి మదనపల్లె సబ్‌జైలులో ఉన్న నిందితులపై పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. దీంతో రౌడీషీటర్ కోనేటి సులోచన, ఆమె అనుచరుడు గుండిగల మోహన్, రియల్టర్ కడియాల శ్రీరాములునాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. మదనపల్లె టూటౌన్ ఎస్ఐ నాగేశ్వర్‌రావు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. భూ ఆక్రమణ వ్యవహారంలో మరో ఎనిమిది మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని, ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని తెలిపారు. వారి కోసం గాలింపు కొనసాగుతోందని, త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొంటున్న కోనేటి సులోచన, కడియాల శ్రీరాములునాయుడులపై గతంలోనూ పలు క్రిమినల్, భూ ఆక్రమణ కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ తాజా అరెస్టులతో మదనపల్లెలో భూ ఆక్రమణ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Read More...

ప్రొద్దుటూరులో 14 మంది చేనేత వర్గానికి చెందిన వారు కౌన్సిలర్లుగా ఎన్నిక : మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి దక్కేది ఎవ్వరికో ?

ఆంధ్రప్రదేశ్ లోని ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ విజయకేతనo ఎగురవేసింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల జరిగిన స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో 52 మంది కౌన్సిలర్లు 51 మంది టిడిపి 1 బిజెపి తరఫున ఏకగ్రీవాలయ్యారు.. టీడీపీ చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సోదరుడు నంద్యాల రాఘవ రెడ్డి ఏకగ్రీవంగా విజయం సాధించారు.  ప్రస్తుతం అందరి దృష్టి వైస్ చైర్మన్ పదవిపైనే నిలిచింది. ఇటీవల చేనేతలకు పెద్దపీఠ వేస్తామని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఎన్నికల్లో ఏకంగా 14 మంది చేనేత వర్గానికి చెందిన వారు కౌన్సిలర్లుగా గెలుపొందడం విశేషం. ​మొదటి నుంచి టీడీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న చేనేత వర్గానికి తగిన గుర్తింపునిచ్చేలా వైస్ చైర్మన్ పదవి వారికే కేటాయించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆశావహులైన నేతలు ఇప్పటికే ఎమ్మెల్యేను కలిసి తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వైస్ చైర్మన్ పదవికి ప్రత్యేకత సంతరించుకుంది..

Read More...

ఏలూరు జిల్లాలో ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు

ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా లోని పలు మండలాల్లో వాగులు,వంకలు,నదులు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా పెద్దవాగుకు ఆకస్మికంగా భారీ వరద నీరు వచ్చి చేరడంతో ముంపు గ్రామాల్లోని ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పోలీస్ యంత్రాంగం రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. వేలేరుపాడు మండలంలో ముమ్మరంగా రక్షణ చర్యలు, తెలంగాణ ఎగువ ప్రాంతాల నుండి పెద్దవాగు ప్రాజెక్టుకు వస్తున్న భారీ ఇన్-ఫ్లో కారణంగా వేలేరుపాడు మండలంలో వరద ముప్పు తీవ్రమైంది, వరదల్లో చిక్కుకున్న కమ్మరిగూడెం, మేడేపల్లి, అల్లూరి నగర్, కోయ మాధవరం గ్రామ ప్రజలను కుక్కునూరు సీఐ బాల సురేష్ బాబు, వేలేరుపాడు ఎస్సై నవీన్ కుమార్ మరియు వారి సిబ్బంది అత్యంత చాకచక్యంగా సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించారు. జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం సమీపంలో ఎగువ నుంచి వచ్చిన ఉధృత వరద ప్రవాహానికి జాతీయ రహదారి కొట్టుకుపోయింది. రహదారి తెగిపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.ఘటనా స్థలానికి చేరుకున్న జీలుగుమిల్లి ఎస్ ఐ క్రాంతి కుమార్,స్టేషన్ సిబ్బంది వాహనాలను దారి మళ్లిస్తూ,ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలు చేపడుతున్నారు. బుట్టాయిగూడెం మండలం పులి రామన్నగూడెంలో స్థానిక వాగులు,వంకలు ప్రమాదకరంగా పొంగిపొర్లుతున్నాయి.దీంతో సమీప గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.వాగులు,వంకలు దాటే సమయంలో వరద ఉధృతిని అంచనా వేయకుండా ఎవరూ రోడ్లపైకి, నీటి ప్రవాహాల్లోకి రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్న పిల్లలను, వృద్ధులను వరద నీటి సమీపానికి వెళ్లకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉంచాలని స్పష్టం చేశారు.అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ప్రజలు వెంటనే స్థానిక అధికారులను లేదా పోలీస్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించి సహాయం పొందాలని కుక్కునూరు సీఐ మరియు వేలేరుపాడు ఎస్సైలు కోరారు.

Read More...

ఏపీపీఎస్సీ అక్రమాల కేసు : మాజీ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు సహా ఏడుగురు నిందితుల ఇళ్లపై దాడులు


ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో ఈడీ రంగంలోకి దిగింది. మూల్యాంకనం సందర్భంగా మనీలాండరింగ్ ద్వారా భారీగా డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఈడీ  హైదరాబాద్ విభాగం ఇవాళ మాజీ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు సహా ఏడుగురు నిందితుల ఇళ్లపై దాడులు నిర్వహిస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్ సహా ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి.

Read More...

మురసు తుఫాను : 48 గంటల్లో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించే లక్ష్యంతో అధికారులు పనిచేయాలి : గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశం

ఆంధ్రప్రదేశ్ లో 'మురసు' తుఫాను నేపథ్యంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా, ప్రాణ, ఆస్తి నష్టాలను సాధ్యమైనంత వరకు నివారించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని విద్యుత్‌ శాఖ అధికారులను మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశించారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని విద్యుత్‌ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. సోమవారం ఏపీసీపీడీసీఎల్‌, ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీలతో పాటు డిస్కంల ఉన్నతాధికారులు, డైరెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి తుఫాను సన్నద్ధతపై సమీక్షించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడితే యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ముందుగానే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సూచించారు. తుఫాను ప్రభావం అధికంగా ఉండే జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని, డిస్కంల సీఎండీలు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. విద్యుత్‌ లైన్లపై ఉన్న ప్రమాదకర చెట్ల కొమ్మలను వెంటనే తొలగించి, గాలుల కారణంగా తీగలు తెగిపడటం, ఇతర ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్‌ పునరుద్ధరణకు అవసరమైన స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుళ్లు, ఇతర పరికరాలు, యంత్రాలను ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి గొట్టిపాటి సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన సంఖ్యలో సిబ్బందిని సిద్ధం చేసుకోవాలన్నారు. అవసరమైతే తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి అదనపు సిబ్బంది, యంత్రాలను రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 48 గంటల్లో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని గొట్టిపాటి ఆదేశించారు. ఒక ప్రాంతంలో మరమ్మతులు పూర్తయిన వెంటనే సిబ్బందిని మరో ప్రాంతానికి తరలిస్తూ పనులు వేగవంతం చేయాలన్నారు. విద్యుత్‌ శాఖతో పాటు రెవెన్యూ, గ్రామ, వార్డు సచివాలయాలు, ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. తుపాను సమయంలో విద్యుత్‌ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు 1912 టోల్‌ఫ్రీ కాల్‌సెంటర్‌ను 24 గంటలూ అందుబాటులో ఉంచాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. ఈదురుగాలులకు విద్యుత్‌ తీగలు తెగిపడినా, స్తంభాలు కూలినా ప్రజలు వెంటనే విద్యుత్‌ శాఖ అధికారులకు లేదా 1912కు సమాచారం అందించాలని సూచించారు. తెగిపడిన విద్యుత్‌ తీగలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దని, వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్‌ స్తంభాలు, చెట్ల కింద నిలబడకూడదని, బలమైన ఈదురుగాలులు వీచే సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రాణనష్టం జరగకుండా సహకరించాలని కోరారు. టెలికాన్ఫరెన్స్‌ సందర్భంగా గతంలో అర్నబ్‌ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న విద్యుత్‌ పునరుద్ధరణ పనుల పురోగతిని కూడా మంత్రి గొట్టిపాటి సమీక్షించారు. మిగిలిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి విద్యుత్‌ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఎక్కడా సిబ్బంది, సామగ్రి కొరత లేకుండా చూసుకోవాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని గొట్టిపాటి రవికుమార్‌ స్పష్టం చేశారు.

Read More...

రీపోలింగ్‌లోనూ ఘర్షణలు, ఉద్రిక్తతలు

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల రీపోలింగ్ జరుగుతున్న పలు చోట్ల నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నిన్న జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్, బూత్ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం 13 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశించించింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా రీ పోలింగ్ ప్రక్రియ చేపట్టారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 13 కేంద్రాల్లో రీ పోలింగ్ కొనసాగనుంది. అనంతపురం కార్పొరేషన్‌లోని 30వ డివిజన్‌లో 3వ నంబర్ పోలింగ్ కేంద్రం, తిరుపతి 36వ డివిజన్‌లో 4వ నంబర్ పోలింగ్ కేంద్రం, కడప నగరపాలక సంస్థ 15వ డివిజన్‌లోని 2వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే మాచర్ల మున్సిపాలిటీలోని 23వ వార్డులో 1, 2వ పోలింగ్ కేంద్రాలు, ప్రకాశం జిల్లా చీమకుర్తి పురపాలక సంఘం 14వ వార్డులోని 1వ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ కొనసాగుతోంది. జమ్మలమడుగు మున్సిపాలిటీలోని 3వ వార్డులో 2వ పోలింగ్ కేంద్రంతో పాటు 17, 29వ వార్డుల్లోని 1వ నంబర్ పోలింగ్ కేంద్రాల్లోనూ రీపోలింగ్ చేపట్టారు. పులివెందుల మున్సిపాలిటీలోని 1, 3, 7, 8వ వార్డుల్లోని 1వ నంబర్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అనంతపురంలోని 30వ డివిజన్‌లోని 3 నంబర్ పోలింగ్ కేంద్రంలో కూటమి నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో ఇక్కడ తిరిగి పోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే సోమవారం ఉదయం రీపోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే మరోసారి వివాదం చెలరేగింది. పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని, బయటి వ్యక్తులు వచ్చారంటూ ఇరు వర్గాలు ఆరోపణలు చేసుకోవడంతో వాగ్వాదం మొదలైంది. అది కాస్తా తోపులాటకు దారితీసింది. దీంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రీపోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు, పోలీసులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

Read More...

రాప్తాడు రంపం దాడి కేసు : నిందితుడికి ఆపరేషన్ చేసి రెండు బుల్లెట్లు తొలగించిన వైద్యులు

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో సంచలనం సృష్టించిన రంపం దాడి ఘటనకు సంబంధించి విచారణ వేగవంతమైంది. పాఠశాల గదిలోకి చొరబడి పదవ తరగతి విద్యార్థినిపై అత్యంత పాశవికంగా దాడి చేసి పరారైన ప్రధాన నిందితుడు హేమంత్ పోలీసుల ఎదురుకాల్పుల్లో గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నిందితుడికి శస్త్రచికిత్స నిర్వహించి, అతడి శరీరం నుంచి రెండు తూటాలను వైద్యులు విజయవంతంగా తొలగించారు. ఆదివారం సాయంత్రం ఆత్మకూరు అటవీ ప్రాంతం సమీపంలో సుమారు 15 ప్రత్యేక పోలీసు బృందాలు నిందితుడి ఆచూకీని గుర్తించాయి. పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేసిన హేమంత్, వారిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆత్మరక్షణ కోసం పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినప్పటికీ నిందితుడు వెనక్కి తగ్గకపోవడంతో, పోలీసులు జరిపిన కాల్పుల్లో హేమంత్ దిగువ శరీరంలోకి తూటాలు దూసుకెళ్లాయి. అనంతరం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో పోలీసులు అతడిని జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం నిందితుడు ఏఎంసీ (AMC) వార్డులో పోలీసుల కట్టుదిట్టమైన భద్రత మధ్య చికిత్స పొందుతున్నాడు. కోలుకున్న తర్వాత అతడిని విచారించనున్నట్లు ఎస్పీ పి. జగదీష్ తెలిపారు.

Read More...

జువ్వలదిన్నె హార్బర్ వద్ద సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు!

ఆంధ్రప్రదేశ్ లోని  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్ సమీపంలో నాటు పడవలో  బాపట్ల కు చెందిన మత్యకారులు వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మెరైన్ ద్వారా స్పీడ్ బోట్లను అప్రమత్తం చేశారు. ఓవైపు తుఫాను హెచ్చరికలు వేటకు వెళ్ళవద్దు అంటూ మత్స్యకారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తున్నా లెక్కచేయక మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లారు.

Read More...

బెంగళూరు వెళ్లి రాప్తాడు బాలిక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా రాప్తాడు స్కూల్లో ఉన్మాది ఘాతుకానికి తీవ్రంగా గాయపడిన విద్యార్థిని కుటుంబాన్ని స్వయంగా బెంగళూరు వెళ్లి పరామర్శించారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని  ఆయన భరోసా ఇచ్చారు. మంత్రి లోకేష్ తన వ్యక్తిగత ఫోన్ నంబర్‌ను సదరు చిన్నారి తండ్రికి స్వయంగా అందించారు. ఏ అవసరం వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా సంకోచించకుండా నేరుగా నాకు ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి అని ఆ తండ్రికి ధైర్యం చెప్పారు. ఒక రాష్ట్ర మంత్రిగా మాత్రమే కాకుండా, ఒక కుటుంబ పెద్దగా వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని మాట ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో బాధిత కుటుంబానికి సంపూర్ణ మద్దతు ఇస్తానని లోకేష్ ప్రకటించారు. పార్టీ తరఫున , ప్రభుత్వం తరఫున అందించాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను తక్షణమే ఏర్పాటు చేస్తామని, న్యాయం జరిగే వరకు నిరంతరం ఫాలోఅప్ చేస్తానని నారా లోకేష్ స్పష్టం చేశారు. క్లిష్ట సమయంలో నేరుగా పరామర్శించి వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇచ్చి ధైర్యం చెప్పడంతో కుటుంబసభ్యులు ధైర్యంతో ఉన్నారు. 

Read More...