3

మీర్‌పేట్‌లో అత్తింటి వారిపై అల్లుడు కత్తితో దాడి : ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

హైదరాబాద్ శివారులో మీర్ పేట్ జయశ్రీ కాలనీలో కుటుంబంలో తలెత్తిన కలహాలు ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్నాయి. కోపంతో రగిలిపోయిన ఒక వ్యక్తి తన అత్తగారి ఇంటి సభ్యులపై విచక్షణారహితంగా కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘాతకంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జయశ్రీ కాలనీలో ఉంటున్న కుటుంబంలో కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో తీవ్ర కోపానికి గురైన అల్లుడు, కుటుంబ సభ్యులపై కత్తితో అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో నిందితుడి అత్త నిరంజన్, అలాగే ఆమె కుమారుడు యూసుఫ్ భార్య రేష్మా తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందారు. నిందితుడి దాడిలో అతని భార్య, కుమార్తెతో పాటు బావమరిది యూసుఫ్ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన యూసుఫ్ పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుల బంధువులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ వివాదాలు, బెదిరింపులపై ఉదయమే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు ఏమాత్రం స్పందించలేదని, పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ రెండు ప్రాణాలు పోయాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మీర్పేట్ పోలీసులు, క్లూస్ టీమ్ తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Related Post

Previous
Next Post »