ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రజలు దీపావళికి ముందు రోజు, పండుగ రోజు పరిమిత వేళల్లో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవడానికి జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతినిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, అలాగే తిరిగి రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చేందుకు అనుమతించింది. పటాకుల నియంత్రణపై ఎన్ని ఉత్తర్వులు జారీ చేసినా క్షేత్రస్థాయిలో కఠినంగా అమలు చేయకపోతే ప్రయోజనం ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది. "ఇది ప్రతీ జీవి ఆరోగ్యానికి సంబంధించిన అంశం. గ్రౌండ్ లెవెల్లో కఠినంగా అమలు చేయనప్పుడు ఆదేశాలు ఇవ్వడంలో అర్థం లేదు, అది విడ్డూరంగా మారుతుంది" అని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజల సెంటిమెంట్లను కూడా తాము అర్థం చేసుకుంటున్నామని, అందుకే పూర్తిస్థాయి నిషేధం విధించలేదని తెలిపింది. నియంత్రణ ఉత్తర్వులను అధికారులు తీవ్రంగా పరిగణించి ఖచ్చితంగా పాటించేలా చూడాలని, తమను కఠిన నిర్ణయాలు తీసుకునేలా నెట్టవద్దని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటికి స్పష్టం చేసింది. శీతాకాలంలో ఢిల్లీలో పెరిగే వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం , వాయు నాణ్యత యాజమాన్య కమిషన్ చేపడుతున్న చర్యలను ASG ఐశ్వర్య భాటి కోర్టుకు వివరించారు. పాత వాహనాలపై ఆంక్షలు, నిర్మాణ రంగ కార్యకలాపాలపై నియంత్రణ, ఆఫీసు వేళల్లో మార్పులు వంటి పలు చర్యలతో కూడిన ప్రణాళిక నవంబర్ నుంచి అమలులోకి రానుందని తెలిపారు. అలాగే పటాకుల్లో బేరియం రసాయనం వాడకంపై అంతర్గత సంప్రదింపులు జరుగుతున్నాయని, దీనిపై నిర్ణయానికి మూడు వారాల గడువు కావాలని కోరగా సుప్రీంకోర్టు సమ్మతించింది. సాధారణ బాణసంచాను గ్రీన్ పటాకుల పేరిట మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని, దీనిని పర్యవేక్షించేందుకు సరైన వ్యవస్థ లేదని కోర్టుకు అమికస్ క్యూరీ , పిటిషనర్ల తరఫు న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వివరించారు. దసరా సమయంలో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గణనీయంగా పడిపోయిందని, పటాకుల తయారీపైనే నిషేధం విధించాలని కోరారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు, పర్యావరణ పరిరక్షణపై క్రీడాకారులు, ప్రముఖుల ద్వారా అవగాహన కల్పించాలని, అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని సూచిస్తూ విచారణను వాయిదా వేసింది.
దీపావళికి ముందు రోజు, పండుగ రోజు పరిమిత వేళల్లో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి
byTelugu Lo Computer
•
•
2 min read
