12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం : ఢిల్లీకి చేరిన 21 దేశాల ప్రతినిధులు

12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరంలో పాల్గొనేందుకు 21 దేశాలకు చెందిన పార్లమెంటరీ ప్రతినిధి బృందాలు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నాయి. బ్రిక్స్‌లోని 11 సభ్య దేశాలు, 10 భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ రెండు రోజుల సమావేశంలో పాల్గొంటున్నారు. నేటి నుండి రెండు రోజుల పాటు పార్లమెంట్‌ భవన సముదాయంలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో ఈ సదస్సు జరగనుంది. లోక్‌సభ స్పీకర్, ఫోరం ఛైర్మన్ ఓం బిర్లా ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా నేడు ఈ కార్యక్రమంలో పాల్గొని, వివిధ దేశాల నుంచి వచ్చిన పార్లమెంట్ స్పీకర్లు, ప్రతినిధి బృందాల అధిపతులతో సమావేశం కానున్నారు. ప్రజల కేంద్రంగా అభివృద్ధి కోసం పార్లమెంట్లను బలోపేతం చేయడం అనే ఇతివృత్తంతో ఈ ఫోరాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలు, ప్రజల అవసరాలకు అనుగుణమైన అభివృద్ధి, శాసన వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై ప్రతినిధులు చర్చించనున్నారు. ఈ రెండు రోజుల సదస్సులో స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత అనే నాలుగు ప్రధాన అంశాలపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. సంస్థాగత సామర్థ్యాల పెంపు, కృత్రిమ మేధస్సు, డిజిటల్ సాంకేతికతలపై పార్లమెంటరీ పర్యవేక్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు వంటి అంశాలు చర్చకు రానున్నాయి. అంతర్జాతీయ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీల ఛైర్మన్లతో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించనున్నారు. పార్లమెంటరీ దౌత్యం, సామర్థ్యాల పెంపు, వివిధ దేశాల శాసన వ్యవస్థల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాల మార్పిడిపై చర్చిస్తారు. సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల మధ్య ద్వైపాక్షిక, బహుళపాక్షిక సమావేశాలు కూడా జరగనున్నాయి.

Post a Comment

Previous Post Next Post
3