స్టీరింగ్ ఊడిపోవడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడిన పామాయిల్ ట్యాంకర్
ఆం ధ్రప్రదేశ్ లోని నెల్లూరు నుంచి పచ్చికాపల్లంకు పామాయిల్ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువు కట్ట దిగువ మలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. కట్ట ఎక్కుతున్న సమయంలో ట్యాంకర్ స్టీరింగ్ ఊడిపోవడంతో వాహనం అదుపుతప్పి వెనుకకు జారుతూ సుమారు పది అడుగుల లోతులోకి దూసుకెళ్లి బోల్తాపడినట్లు సమాచారం. ప్రమాద సమయంలో ట్యాంకర్‌లో ఉన్న డ్రైవర్ సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ట్యాంకర్ బోల్తాపడినప్పటికీ పామాయిల్ పెద్ద మొత్తంలో లీకేజీ కాకపోవడంతో ప్రమాదం మరింత తీవ్రతరం కాలేదు. సమాచారం అందుకున్న రామచంద్రాపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై వివరాలు సేకరించారు అనంతరం స్థానికంగా అందుబాటులో ఉన్న జేసీబీల సహాయంతో ట్యాంకర్‌ను గోతిలో నుంచి బయటకు తీసి రోడ్డుపైకి తీసుకువచ్చారు.ట్యాంకర్ తొలగింపు చర్యల అనంతరం రహదారిపై వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.