భారీగా పెరిగిన వంట నూనె ధరలు !
వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచుతున్నట్లు మోడీ సర్కార్ చేసిన ప్రకటనతో నూనెల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. కేంద్రం ప్రభుత్వ ప్రకటన సామాన్యులపై పెనుభారం మోపింది. మొన్నటి దాకా సాధారణంగా ఉన్న వంటనూనెల ధరలు ఒక్కసారిగా 20 రూపాయల వరకు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లీటరు వంట నూనెపై 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెంచడంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. ఇప్పటివరకు లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర 115 రూపాయలు ఉండగా, ఒకే రోజు తేడాలో 130 రూపాయలకు చేరింది. పామోలిన్ ధర లీటరు 115 రూపాయలకు పెరిగింది. ముడి పామోలిన్, సోయా, పొద్దు తిరుగుడుపై సుంకం విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రకటనతో వ్యాపారులు ఒక్కసారిగా నూనెల ధరలు పెంచేశారు. వంటనూనెలతో పాటు పూజకు ఉపయోగించే నూనె ధరలు కూడా లీటరుకు 15 రూపాయలకు పైగా పెంచేశారు. దుకాణాల్లోనే కాదు ఆన్‌లైన్ విక్రయ సంస్థలు కూడా ధరలను పెంచాయి. కేంద్రం దిగుమతి సుంకం పెంచడంతోనే తాము ధరలు పెంచాల్సి వచ్చిందంటున్నారు వ్యాపారులు.