రేపటి నుంచి సమ్మెలోకి వెళ్లనున్న విజయవాడ మున్సిపల్ కాంట్రాక్టర్లు
వి జయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కాంట్రాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు. గత పది నెలలుగా ప్రభుత్వం నుండి సుమారు రూ.350 కోట్ల బకాయిలు రావలసి ఉన్నప్పటికీ, అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ కాలంగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక మానసిక వేదన అనుభవిస్తున్నామని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రేపటి నుంచి కార్పొరేషన్ పరిధిలోని అన్ని రకాల నిర్మాణ, నిర్వహణ పనులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. మున్సిపల్ అధికారులు, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రూ.350 కోట్ల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కాంట్రాక్టర్ల సంఘం డిమాండ్ చేస్తోంది. తమ సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. నిధులు విడుదలయ్యే వరకు వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు.