About LATEST NEWS AP TO TG

Telugu computer tutorials Unicode to Anu conversion smartphone tips Telugu Use smartwatch tips Telugu EV news Telugu tech upd

Manual Description Here: Ea eam labores imperdiet, apeirian democritum ei nam, doming neglegentur ad vis.

3
Showing posts with label Chief Minister Revanth Reddy. Show all posts
Showing posts with label Chief Minister Revanth Reddy. Show all posts

సంఘ్ పరివార్‌ను ఓడించడానికి దేశ ప్రజలంతా గాంధీ పరివార్‌కు అండగా నిలవాలి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కేరళలో ప్రతిష్టాత్మక 'ఆర్యదాన్ ముహమ్మద్ ఉత్తమ ప్రజాసేవకుడు' పురస్కారాన్ని అందుకున్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ జాతీయ రాజకీయాలు, సమకాలీన పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో రెండు విభిన్న సిద్ధాంత కుటుంబాల మధ్య పోరాటం సాగుతోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. "ఒకటి సంఘ్ పరివార్, మరొకటి గాంధీ పరివార్. సంఘ్ పరివార్‌ను ఓడించడానికి దేశ ప్రజలంతా గాంధీ పరివార్‌కు అండగా నిలవాలి" అని ఆయన కోరారు. సంఘ్ పరివార్ వైఖరిని తీవ్రంగా ఎండగడుతూ, వారు కులం, మతం, ప్రాంతం, భాష ఆధారంగా దేశాన్ని అన్ని విధాలుగా విభజించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. దేశ సమగ్రతకు, ప్రజాస్వామ్య మనుగడకు సంఘ్ పరివారే అత్యంత పెద్ద ముప్పుగా మారిందని ఆయన హెచ్చరించారు. భారత ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను రక్షించాలంటే ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Read More...

కాళోజీ సేవలు చిరస్మరణీయం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ భాష, యాస, సంస్కృతి, ప్రజల జీవన విధానాన్ని తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిన ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ఆ మహనీయుడి సేవలను మనమంతా స్మరించుకోవాలన్నారు. కాళోజీ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పుష్పాంజలి ఘటించారు. ప్రజల గొంతుకగా నిలిచిన కాళోజీ స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు ప్రజా ప్రభుత్వం సారథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ భాషకు కాళోజీ చేసిన సేవలు శ్లాఘనీయమని, ఆయన స్ఫూర్తితో తెలంగాణ భాష, సాహిత్యానికి మరింత ప్రోత్సాహం అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

Read More...

బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టేందుకు పార్టీ కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్‌లోని తన నివాసంలో కార్యకర్తలు, స్థానిక నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాజకీయాలు, ఓటర్ల జాబితా, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకోవడం వల్లే జాతీయ స్థాయిలో కొడంగల్‌కు గుర్తింపు, గౌరవం లభించిందని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్లను తొలగించే కుట్రకు పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని ఓటర్ల జాబితాలో మార్పులు చేస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఇదే తరహా పరిస్థితులు కనిపించాయని, తెలంగాణలోనూ అదే విధంగా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో దొంగదెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తే పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో ఎన్నికల్లో ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించేవారని, ఇప్పుడు ఓట్ల తొలగింపు ద్వారా పేదల ఓటు హక్కును దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం విమర్శించారు. చిన్న చిన్న తప్పిదాలను సాకుగా చూపి అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని చెప్పారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ కూడా బీజేపీకి సహకరిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. ప్రజల ఓట్లను రక్షించాల్సిన బాధ్యత ముఖ్య నాయకులపై ఉందన్నారు. గ్రామాల వారీగా బీఎల్‌ఏలను సమన్వయం చేసుకుని అర్హులైన పేదల ఓట్లు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మండల స్థాయి నాయకులు తమ పరిధిలో ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి నాలుగు గ్రామాలకు ఒక నాయకుడు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రతి బూత్‌లో ఒక్క అర్హుడైన ఓటు కూడా తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టేందుకు పార్టీ కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సూచించారు.

Read More...

విదేశీ పర్యటన తిరస్కరణకు కారణాలు ఏమిటో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాలి !

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న తర్వాత సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తన అమెరికా పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించామని, రాజకీయపరమైన కారణాలతో పర్యటనను తిరస్కరిస్తున్నామని ఆ శాఖ అధికారులు చెప్పారని, ఆ కారణాలు ఏమిటో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాలి అని అన్నారు.  తన పర్యటనను తిరస్కరించడమే కాక బీజేపీ నాయకులు రాజకీయంగా తనపై వ్యక్తిగత ఆరోపణలు చేశారని, బీజేపీ నాయకులు విచక్షణ కోల్పోయి రాష్ట్ర ప్రభుత్వంపై, తన అధికారిక పర్యటనపై తప్పుడు ప్రకటనలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ వైఖరిపై రాజకీయ అంశాలను తాను ప్రస్తావించదలచుకోలేదని, ఇది రెండు ప్రభుత్వాలకు సంబంధించిన అంశం అని అన్నారు. ఈనెల 17 నుంచి 28వ తేదీ వరకు అమెరికా, కెనడా పర్యటనకు గుజరాత్ ముఖ్యమంత్రికి అనుమతించారన్నారు. వైబ్రంట్ గుజరాత్ అని పెట్టుబడుల కోసం గుజరాత్ ముఖ్యమంత్రికి అనుమతి ఇచ్చారు కానీ తెలంగాణ రైజింగ్ 2047లో భాగంగా అమెరికాలో పర్యటించాలనుకుంటే తనను అడ్డుకున్నారని అన్నారు. నిజంగా తన విదేశీ పర్యటనలో విషయం లేదనుకుంటే ఇంగ్లాండ్‌కు ఎందుకు అనుమతి ఇచ్చారు.. అమెరికాకు ఎందుకు తిరస్కరించారు అని ప్రశ్నించారు. మహాత్మా గాంధీ, అంబేడ్కర్ ఇంగ్లాండ్‌లో చదువుకుని దేశానికి దార్శనికులుగా మారారు అంటూ ఆర్ధికంగా వెనకబడిన వారు విదేశాల్లో చదువుకునే పరిస్థితి ఉండదు.. విదేశీ చదువులను, క్రీడలను ఇక్కడికి తీసుకురావాలని తాము ప్రయత్నిస్తున్నాం అని చెప్పారు. ఇందుకు విదేశీ పర్యటనలు ఉపయోగపడతాయని భావించామన్నారు. ప్రధాని ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నారు తప్ప భారత ప్రధానిగా వ్యవహరించడం లేదని విమర్శించారు. ఇది రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా జరిగిన అవమానం కాదు ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయం.. దీనిని రాజకీయాలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఉంది అని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటనను కేంద్రం అడ్డుకోవడం తెలంగాణ అభివృద్ధిని వ్యతిరేకించడమే.. కేంద్రం వైఖరి చూస్తోంటే స్పష్టంగా తెలంగాణపై వివక్ష కనిపిస్తోందని సీఎం అన్నారు. తమ ఎంపీలు ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తారన్నారు. గుజరాత్ అభివృద్ధికి ఇబ్బంది కలుగుతుందనే తన పర్యటనను కేంద్రం అడ్డుకుందన్నారు. ఇది రాజకీయ వివక్ష.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమేనంటూ తామంతా కేంద్రం వైఖరిని ముక్త కంఠంతో ఖండిస్తున్నామన్నారు. ఇది ఫెడరల్ సూర్తికి విరుద్ధమన్నారు. తన పర్యటనను అడ్డుకోవచ్చు.. కానీ తన లక్ష్యాన్ని చేరుకోకుండా అడ్డుకోలేరు అని అన్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026ను డిసెంబర్ 8,9 తేదీల్లో నిర్వహిస్తున్నామని, విద్య, క్రీడల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి సరైన వివరాలు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు.. ఇది అధికారిక పర్యటన.. తమ కార్యక్రమాలన్నీ భారత రాయబార కార్యాలయం పర్యవేక్షణలో జరుగుతాయి.. ఇది చాటుమాటుగా జరిగే వ్యవహారం కాదు.. అన్ని వివరాలను విదేశీ వ్యవహారాల శాఖకు అందించాం అని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ అంటే మోదీకి వివక్ష.. చిన్న చూపు.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు గుజరాతీ నాయకత్వం చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. రాజకీయ పార్టీల మధ్య సిద్ధాంత వైరుధ్యాలు ఉండొచ్చు… కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండాలి అని పేర్కొన్నారు. కేంద్రం వైఖరి సత్సంబంధాలను దెబ్బతీసేలా ఉందన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లొచ్చు కానీ తెలంగాణ ముఖ్యమంత్రిగా తన పర్యటనను అడ్డుకుంటారట.. కేంద్రం వైఖరితో తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు రాకుండా పోతాయన్నదే తమ ఆవేదన.. తెలంగాణ అభివృద్ధి కోసం కచ్చితంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Read More...

ఆడబిడ్డలందరికీ నాణ్యమైన చిలకపచ్చ చీరలను అందజేస్తాం !


తెలంగాణలోని ములుగు జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ తరఫున హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సూచికగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించడంతో పాటు నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పరకాల నియోజకవర్గానికి చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి, నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. తమ ప్రభుత్వంలో మేడారంలోని సమ్మక్క-సారలమ్మ ఆలయాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామని సీఎం స్పష్టం చేశారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామప్ప, వేయి స్తంభాల ఆలయాల ఆధ్యాత్మిక శోభతో పోటీపడేలా మేడారం పుణ్యక్షేత్రాన్ని సమగ్రంగా తీర్చిదిద్దామని, రాబోయే రోజుల్లో జంపన్న వాగును కూడా మోడల్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గత పాలకులు వనదేవతల క్షేత్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో నిరుపేద ఆడబిడ్డలకు పంపిణీ చేసే బతుకమ్మ చీరల కొనుగోళ్లలో కూడా కమీషన్లు పిండుకున్నారని ముఖ్యమంత్రి తీవ్రంగా ధ్వజమెత్తారు. తమ పాలనలో మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ రాబోయే డిసెంబర్‌లో పండుగ కానుకగా ఆడబిడ్డలందరికీ నాణ్యమైన చిలకపచ్చ చీరలను అందజేస్తామని ప్రకటించారు. ప్రతిపక్ష ముఖ్య నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందనే స్వార్థంతో సొంత చెల్లెలినే ఇంట్లో నుంచి గెంటేసిన సంస్కృతి వారిదని మండిపడ్డారు. కనీసం సొంత బిడ్డను ఇల్లు వెళ్లగొడుతుంటే అడ్డు చెప్పకుండా తండ్రి సైలెంట్‌గా ఉండిపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో పాడిపంటలు ఎండిపోయి, తీవ్ర కరువు రావాలని కోరుకుంటూ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి కొందరు అఘోరాలు, క్షుద్రపూజలు చేయిస్తున్నారని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

Read More...

ఎస్ఐఆర్‌ ప్రక్రియ పేరుతో కుట్రలు జరుగుతున్నాయి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్‌ ప్రక్రియ పేరుతో కుట్రలు జరుగుతున్నాయని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బెంగాల్ తర్వాత తెలంగాణే టార్గెట్ అని కొందరు చెబుతున్నారని, రాష్ట్రంలో 70 లక్షల ఓట్లు తొలగించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఓట్ల తొలగింపు కోసం జరుగుతున్న కుట్రలు ఫలించకూడదని అన్నారు. హైదరాబాద్‌లోని కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్లో సీఎం పాల్గొని మాట్లాడారు. రాబోయే పది రోజుల పాటు ప్రతి పోలింగ్ బూత్‌లోని కార్యకర్త ఒక్కో రేవంత్ రెడ్డిలా పనిచేయాలని సూచించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, గుజరాత్ నుంచి వస్తున్న వారిని అడ్డుకునేందుకు అందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఓటర్ల పేర్లు నమోదు చేసే సమయంలో చిన్నపాటి పొరపాట్లు కూడా జరగకుండా చూడాలని సీఎం సూచించారు. చిన్న తప్పిదాల కారణంగా అర్హులైన వ్యక్తుల ఓట్లు తొలగిపోయే పరిస్థితి రాకూడదన్నారు. బీఎల్ఓల పనితీరు ఎలా ఉన్నా, పార్టీ కార్యకర్తలు బీఎల్ఏలుగా బాధ్యత తీసుకుని అర్హులైన ప్రతి ఓటు జాబితాలో ఉండేలా చూడాలని కోరారు. ముస్లిం మైనారిటీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లను అడ్డుకునేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిందని, వాటిని రద్దు చేయించేందుకు ప్రయత్నాలు జరిగాయని విమర్శించారు. రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నాలు అత్యున్నత న్యాయస్థానాల వరకు వెళ్లాయని, అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వాటిని అమలు చేసిందని చెప్పారు. మైనారిటీల ప్రతిభా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన పలువురు మైనారిటీ ప్రతినిధులకు అవార్డులు అందజేశారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యతిరేక వైఖరి కలిగి ఉన్నారని సీఎం ఆరోపించారు. సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్‌ను సెక్యులర్ పార్టీగా అభివర్ణిస్తూ హిందువులు, ముస్లింలను రెండు కళ్లలా చూస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం గ్రూప్-1 పరీక్షలు, నియామకాలను సక్రమంగా నిర్వహించలేకపోయిందని ఆరోపించారు. టీజీపీఎస్సీలో ఒక ఆర్‌ఎంపీ వైద్యుడిని సభ్యుడిగా నియమించారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో గ్రూప్-1 నియామకాలకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని, ఒకసారి నియామక ప్రక్రియ చేపట్టినా ప్రశ్నపత్రాలు పల్లి, బఠానీల్లా అమ్మారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి విద్యావంతులను నియమించామని సీఎం తెలిపారు. టీజీపీఎస్సీ ద్వారా గ్రూప్-1 పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. గ్రూప్-1 నియామకాలను రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌ నేతలు సుప్రీంకోర్టు వరకు వెళ్లారని, తమ ప్రభుత్వం తరఫున సమర్థుడైన న్యాయవాదిని నియమించి వాదనలు వినిపించడంతో నియామకాలను పూర్తిచేయగలిగామని వివరించారు. అదేవిధంగా గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పోస్టుల భర్తీ విషయంలోనూ కోర్టుల్లో న్యాయపోరాటం చేసి ఉద్యోగ నియామకాలను పూర్తి చేశామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Read More...

ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది సంపూర్ణంగా ప్రభుత్వ విచక్షణాధికారం !

న్యూఢిల్లీలోని కృషి భవన్‌లో కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను కలిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ న్యాయస్థానాలపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ''కోర్టు ధిక్కరణ కింద అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే.. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మీద గతంలో 400 కంటెంప్ట్‌ ఆఫ్‌ కోర్టు కేసులున్నాయి. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? సోమేశ్‌పై 400 కోర్టు ధిక్కరణ కేసులున్నా నాడు నోరు మెదపని వారు, ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. అధికారులు, ఉద్యోగుల కేటాయింపు, ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది సంపూర్ణంగా ప్రభుత్వ విచక్షణాధికారం. ఆ హక్కును ఎవరూ బలవంతంగా గుంజుకోలేరు'' అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తప్పించాలని తెలంగాణ సీఎస్ కు  హైకోర్టు సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఏడాదిన్నరలోనే ఆయనపై 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయని, ఆయనను కొనసాగిస్తే చట్టబద్ధ పాలనకు ప్రమాదమని కూడా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు తమ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణ 'హైడ్రా' అని తేల్చి చెప్పారు.  ''బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎడ్ల సుధాకర్‌ రెడ్డి 10 ఎకరాల బతుకమ్మ కుంటను కబ్జా చేసి అమ్ముకున్నాడు. ఆ తర్వాత కేసీఆర్‌ అక్కడికి వస్తే, విమానం నుంచి పూలు చల్లాడు. పదెకరాల బతుకమ్మ కుంటను కబ్జా చేసి అమ్ముకున్నాక పూల వర్షమే కాదు.. బంగారమే చల్లుతారు. బతుకమ్మ కుంటను బీఆర్‌ఎస్‌ నాయకులు కబ్జా పెట్టుకున్నారు. దానిపై వాళ్లే కోర్టు ధిక్కరణ కేసులు వేశారు. దీనిని ఏవిధంగా చూడాలి?'' అని రేవంత్‌ రెడ్డి అన్నారు. హైడ్రా విషయంలో కబ్జాకోరులు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ''హైడ్రా మంచి పనులు చేస్తోంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రేటెస్ట్‌ రిఫార్మ్‌ 'హైడ్రా'. అత్యుత్తమ సంస్థల్లో ఒకటి. ప్రభుత్వ పార్కులు, చెరువులు, కుంటలు, నాలాలను కాపాడటమే హైడ్రా విధి. ఆ పనిని పకడ్బందీగా చేస్తోంది. ఎన్‌ కన్వెన్షన్‌ను కూలగొట్టింది. గండిపేట చెరువులో ఆక్రమణలు కూలగొట్టింది. అవి పేదోళ్లవా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్నోళ్లు పేదోళ్లా?'' అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పని చేయకుండా హైడ్రాను అడ్డుకునే కబ్జాదారులకు సహకరించవద్దని కోరారు. కబ్జాదారులను కాపాడటానికి డబ్బులు పెట్టి సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ''హైడ్రా కార్యాచరణ, బాధ్యతలపై ప్రభుత్వానికి స్పష్టత ఉంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇంకా పరిశీలించలేదు. ప్రభుత్వపరంగా సమీక్షిస్తాం. కోర్టు ఆదేశాలను, న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. భవిష్యత్తులోనూ హైడ్రా పనులను కొనసాగిస్తాం'' అని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏ సంవత్సరానికి సంబంధించిన ఫీజుల మొత్తాన్ని అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తామని, అడ్వాన్స్‌డ్‌గా బ్యాంక్‌ ఖాతాల్లో వేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఏటా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.2,200-2,400 కోట్లు అవసరమవుతాయని స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా వాటిని చెల్లించేందుకు ప్రణాళికలు రచించామని, భవిష్యత్తులో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సమస్య ఉత్పన్నం కాదని తెలిపారు. ''ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి కేసీఆర్‌ ప్రభుత్వం రూ.8 వేల కోట్ల బకాయిలను పెట్టి పోయింది. కేసీఆర్‌ పెట్టిన బకాయిలే మాకు భారంగా మారాయి. కానీ, మేం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదన్నట్లుగా, మా ప్రభుత్వం కారణమన్నట్లుగా బీఆర్‌ఎస్‌ భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తోంది. దానికి బీజేపీ వంతపాడుతోంది'' అని సీఎం రేవంత్‌ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు బకాయిలపై బీజేపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. కూటమి ప్రభుత్వం ఉన్న ఏపీలో 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయించిన తర్వాత తెలంగాణలో డిమాండ్‌ చేస్తే బాగుంటుందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు రామచందర్‌రావు, ఆ పార్టీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్యలకు హితవు పలికారు. ఎలాంటి వసతులు లేకుండా, దొంగ లెక్కలు చూపించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కొట్టేయాలనుకునే సంస్థల మీద విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ సాగుతోందని, సక్రమంగా ఉన్న వాళ్లకు బకాయిలు చెల్లిస్తామని ఓ ప్రశ్నకు సీఎం బదులిచ్చారు. యూనివర్సిటీల మీద ఆధిపత్యం చెలాయించాలనే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలి. విద్యను వీలైనంత వరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంచితే తప్పిదాలకు అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలి. అప్పుడు రాహుల్‌ గాంధీ అన్ని అంశాలపై మాట్లాడతారు'' అని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రశ్న పత్రాల లీకేజీలకు కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ''అనుమతి లేకుండానే దేశంలో కోచింగ్‌ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అవి ప్రశ్న పత్రాలు లీక్‌ అవ్వడానికి వేదికలుగా మారుతున్నాయి. దీనిపై దేశస్థాయిలో ఒక విధానాన్ని రూపొందించాలి'' అని అభిప్రాయపడ్డారు. ప్రశ్న పత్రాల లీకేజీల నివారణకు కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాన్ని చూసిన తర్వాత రాష్ట్రంలో ఏం చేయాలనేది చూస్తామని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టామని, పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని తెలిపారు. విద్యార్థులకు నమ్మకం, విశ్వాసం కలిగించేలా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్లోబరీనా వంటి సంస్థలు అక్రమాలకు పాల్పడినా గత ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో వాళ్లు సీబీఎ్‌సఈ పరీక్షల వరకు విస్తరించి, వాటిని కూడా గందరగోళం చేశారని విమర్శించారు. తెలంగాణలో పరిస్థితుల పరిశీలనకు క్షేత్రస్థాయి పర్యటనకు రావాలని కేంద్ర మంత్రి చౌహాన్‌ను ఆహ్వానించినట్లు తెలిపారు.

Read More...

తెలంగాణను ఒలింపిక్స్‌ వేదికగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పనిచేస్తున్నాం !

తెలంగాణను రాబోయే రోజుల్లో ఒలింపిక్స్‌కు వేదికగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఒలింపిక్స్‌లో ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్ అత్యంత వెనుకబడిందని, ప్రభుత్వాలకు ఒక విధానం లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. అప్పుడప్పుడు పీటీ ఉష లాంటి క్రీడాకారులు క్రీడల్లో దేశానికి పేరు తెచ్చారని కొనియాడారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ను క్రీడల్లో రాణించిన దేశంగా గుర్తించడం లేదని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చిందని తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ విధానంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నామని ఆయన చెప్పారు. క్రీడల్లో రాణించిన పీటీ ఉష రాజ్యసభ సభ్యురాలి స్థాయికి చేరారని గుర్తు చేశారు. లక్ష్యాన్ని చేరాలంటే వంద శాతం కష్టపడాల్సిందేనన్నారు. యువకులు ఈ దేశ సంపద అని, క్రీడల్లో రాణిస్తే మీ భవిష్యత్తు బాగుంటుందని, క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగాలతోపాటు నగదు పారితోషికం ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 2028 నాటికి తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించుకుంటామని, క్రీడల్లో రాణించి దేశానికి పేరు తెస్తే మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష, క్రీడలు, యువజనుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, శాసమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, పుల్లెల గోపీచంద్, స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ జి.కిషోర్, శాట్-జి చైర్మన్ శివసేనా రెడ్డి, ప్రముఖ క్రీడాకారులు, ద్రోణాచార్య, అర్జున అవార్డు గ్రహీతలు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎ న్యూ ఎరా ఫర్ తెలంగాణ స్పోర్ట్సు ఎక్సలెన్స్‌ను సీఎం ప్రారంభించి యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లోగో, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫిజికల్ లిటరసీ మిషన్‌ను, యంగ్ ఇండియా స్పోర్ట్స్ ఫెలోషిప్, అకడమిక్ కోర్సులను ప్రారంభించారు. ఆదిత్య మెహతా ఫౌండేషన్‌తో నేషనల్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రాం ఫర్ పారా అథ్లెట్స్‌కు పభుత్వం అవగాహన ఒప్పందం (ఎంవోయÖ) కుదుర్చుకున్నది. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన మై భారత్‌తోనూ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్న టోర్నమెంట్స్, లీగ్స్ వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. 8వ ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యÖత్ గేమ్స్-2026, నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెట్స్ మీట్(ఎనఐడీజేఏఎం) టోర్నమెంట్స్ తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్నది. హాకీ ఇండియా లీగ్, ప్రపంచ పికిల్ బాల్ లీగ్, ఆర్చరీ ప్రీమియర్ లీగ్, టెన్నిస్ ప్రీమియర్ లీగ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నది. తెలంగాణ స్పోర్ట్సు నాలెడ్జి ఆన్ వీల్స్ స్పోర్ట్స్ నాలెడ్జ్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు.

Read More...

కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం !

హైదరాబాద్ లోని నాచారంలో సీఎం రేవంత్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన బాలామృతం ప్లాంట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలామృతం ఉత్పత్తికి సంబంధించిన ప్యాకింగ్స్‌ను పరిశీలించారు. గర్భిణీలను ఆదుకోవాలని ఆనాడు ఇందిరాగాంధీ గారు మహబూబ్ నగర్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని అది ఈ రోజు అంచెలంచెలుగా ఇది ఒక పరిశ్రమగా ఎదిగిందని సీఎం అన్నారు. సీఎం మాట్లాడుతూ "ఈ రోజు కొత్తగా బాలామృతం ప్లాంట్ ను ప్రారంభించుకున్నాం. ప్రజా ప్రభుత్వంలో 2 కోట్లకు పైగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఇందిరమ్మ ఇండ్లను మహిళ పేరుతోనే ఇస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తున్నాం. మూడు కోట్ల 28 లక్షల తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. పట్టణ ప్రాంతంలో పేదలను ఆదుకునేందుకు లక్ష ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం వెయ్యి బస్సులకు మహిళలను యజమానులను చేశామని వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టును మహిళకు అప్పగించామని పేర్కొన్నారు. 2034 లోగా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తన లక్ష్యమని ఆ దిశగా చర్యలు చేపడుతూ ముందుకు వెళుతున్నాం ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టడమే కాదు.. పేదల బిడ్డలు ఆకలితో ఉండకూడదనే ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీం ను తీసుకొచ్చాం. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ స్కీం మొదలు పెట్టామన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

Read More...

మూసీ నదీ ప్రక్షాళన చేసి తీరుతానని ఒట్టేసి చెబుతున్నా!

తెలంగాణలోని నల్గొండ జిల్లా కనగల్ మార్కెట్ యార్డులో రోడ్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.83 కోట్లతో చేపట్టనున్న మంచినీటి పథకానికి కూడా భూమిపూజ చేశారు. రాష్ట్రంలో హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. రూ. 13,000 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్యాకేజీలుగా 6,092 కి.మీ. పొడవు గల 441 రహదారులను విస్తరించే కార్యక్రమం పైలాన్ ఆవిష్కరణతో ప్రారంభమైంది. అనంతరం నల్గొండ ఎన్‌జీ కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ ఈ ప్రక్షాళన ప్రక్రియను అడ్డుకోవడానికి కొందరు రాజకీయ స్వార్థంతో ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గబోమని, మూసీ నదీ ప్రక్షాళన చేసి తీరుతానని ఒట్టేసి చెబుతున్నానని పేర్కొన్నారు. దీంతో పాటు డిండి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే సంక్షేమ పథకాల అమలుకు పెద్దపీట వేసిందని రేవంత్ రెడ్డి వివరించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించడంతో పాటు, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ సదుపాయం కల్పిస్తున్నామని గుర్తు చేశారు. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ పేదలపై ఆర్థిక భారం తగ్గించామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేలా నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్యా విధానాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. విద్యార్థుల కోసం ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం నాణ్యమైన భోజనం, సాయంత్రం వేళల్లో స్నాక్స్ అందిస్తున్నామన్నారు. యువతలో నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, ఐటీఐలను అధునాతన టెక్నాలజీ కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు. తమ హయాంలో రికార్డు స్థాయిలో నిరుద్యోగుల కోసం సుమారు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి యువత ఆత్మగౌరవాన్ని కాపాడామని సీఎం తెలిపారు. ప్రజా ప్రభుత్వం సాధించిన ఈ ప్రగతి విజయాలపై అసెంబ్లీ వేదికగా ఏ పార్టీతోనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన సవాల్ విసిరారు. చివరగా నీలగిరి జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులకు స్వయం సహాయక సంఘాల చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేశారు.

Read More...

నేను గుంపు మేస్త్రినే : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను గుంపు మేస్త్రీ అంటూ బీఆర్ఎస్ నేతలు మరియు ఇతర వ్యతిరేక పక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ, తాను గుంపు మేస్త్రీనే అని గర్వంగా ప్రకటించారు. తన గుంపు తనకు బలమని, ఆ బలమే తన ప్రతిష్ఠ అని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు హైదరాబాద్‌లోని ఒక కార్యక్రమంలో చేశారు. ప్రతిపక్షాలు తనపై అవహేళన చేస్తున్నా తాను పట్టించుకోవడం లేదని, దానిని ఎప్పటికప్పుడు స్వీకరించి ముందుకు సాగుతున్నానని సీఎం స్పష్టం చేశారు. తన గుంపులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు అందరూ కష్టపడి పని చేస్తున్నారని ప్రశంసించారు. ప్రజలంతా తన గుంపులో భాగమే అని ఆయన తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు. కొందరు తాము దొరలమని గొప్పలు చెప్పుకుంటారు. నాకు అలాంటి భావన లేదు. నాకు సార్ అని పిలవడం కంటే రేవంతన్న అని పిలిస్తేనే ఇష్టం అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల్లో ఇష్టం, ప్రేమ ఉంటేనే సీఎంను కూడా అన్నా అని పిలుస్తారని ఆయన అన్నారు. మూసీ నది ప్రక్షాళన పనులు చేపడుతుంటే తన కాళ్లలో కట్టెలు పెడుతున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రోను విస్తరించాలని ప్రయత్నాలు చేస్తుంటే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ పనులు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని, ఫాంహౌస్‌లలో ఉంటున్న వారికి ఇవి అవసరం లేకపోవచ్చని, కానీ సామాన్యుల జీవనం మెరుగుపరచడానికి ఇవి చాలా ముఖ్యమని రేవంత్ రెడ్డి వివరించారు.గతంలో బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ విధ్వంసం అయిందని, ఆ పార్టీకి గోరీ కట్టే మేస్త్రీగా తాను పని చేస్తున్నానని ఇంతకుముందు కూడా ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి గుంపు మేస్త్రీ అని తనను తాను ప్రకటించటం ద్వారా ప్రతిపక్షాల విమర్శలను తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజల్లో మంచి స్పందన పొందుతోంది. తెలంగాణ అభివృద్ధికి తన గుంపుతో కలిసి కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More...

ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించి  మాట్లాడుతూ ఉద్యోగులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే బీమా రక్షణ పథకాన్ని అమల్లోకి తెస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు బీమా కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటివరకూ సింగరేణిలో 45 మంది కార్మికులకు ప్రమాద బీమా అందించామన్నారు. ఉద్యోగులు, కార్మికులకు రక్షణ కల్పించే బాధ్యత తమ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. తనను రేవంతన్న అని పిలిస్తే సంతోషంగా ఉంటుందన్నారు. తాను ఒకప్పుడు జెడ్పీటీసీనని, ఆ తర్వాత ఎంపీనని, ఇప్పుడు సీఎంనని రేవంత్‌ అన్నారు. పదవులు ఇలా మారుతూ ఉంటాయని, అందుచేత రేవంతన్న అనేది శాశ్వతంగా ఉంటుందన్నారు.

Read More...

సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం : తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి


సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఘనంగా నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ప్రసంగించారు. తెలంగాణ సమాజం రాచరికాన్ని, పెత్తనాన్ని ఎన్నటికీ సహించదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్ర కలని సాకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీలకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్ఫూర్తితో, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. 'తెలంగాణ విజన్-2047' లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ, రాష్ట్ర రైతులను వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా, అత్యంత పారదర్శకంగా ఇప్పటివరకు 67 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ భర్తీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని పేర్కొంటూ.. ఈ నెలలోనే టిజిపిఎస్సి ద్వారా ఇంజినీరింగ్‌, పీసీబీ, అటవీశాఖ, టౌన్‌ప్లానింగ్‌, విద్యాశాఖల్లో మరిన్ని కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలోని విద్యావ్యవస్థ బలోపేతానికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. ఇందులో భాగంగా 1,362 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రారంభించాం. ఈ ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఉచితంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ (అల్పాహారం) అందిస్తున్నాం. జూనియర్ కాలేజీ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని త్వరలోనే అమలు చేయబోతున్నాం అని అన్నారు. పేద ప్రజలను అద్దె ఇళ్ల బాధల నుంచి విముక్తి చేయడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. గత 13 నెలల కాలంలో రూ.22 వేల కోట్ల వ్యయంతో 1.25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 3.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, ఈసారి క్యూర్‌ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని స్పష్టం చేశారు. అలాగే, పేదలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్‌ కార్డుల పంపిణీని కూడా పూర్తి చేశామని వివరించారు. ఈ వేడుకల ముగింపులో భాగంగా, రాష్ట్రంలో ఉత్తమ సేవలు అందించిన పలువురు పోలీసు అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 'విశిష్టసేవా పురస్కారాలను' ప్రదానం చేశారు.

Read More...

బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి !


ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ లతో రాష్ట్రాన్ని గ్రీన్ ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృతంగా చర్చలు జరిపారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలను వివరించారు. ఈ సందర్భంగా బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సీఎం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. గ్రీన్ స్టీల్ ఉత్పత్తి ద్వారా కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటంతో పాటు దేశంలో ఉక్కు కొరతను తగ్గించవచ్చని ఆయన వివరించారు. అంతేకాకుండా పాత వాహనాల స్క్రాప్‌ను ఉపయోగించి ఉక్కును రీసైక్లింగ్ చేసే ఆధునిక పరిశ్రమను తెలంగాణలో ఏర్పాటు చేయాలని కూడా కోరారు. ఇది సర్క్యులర్ ఎకానమీకి బలాన్నిస్తూ, వ్యర్థాలను విలువైన వనరులుగా మార్చే దిశగా కీలకంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలానే 'తెలంగాణ రైజింగ్-2047' విజన్‌లో భాగంగా రాష్ట్రాన్ని పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలను సీఎం కేంద్ర మంత్రులకు వివరించారు. ఇప్పటికే ఉన్న మౌలిక వసతులు, నైపుణ్య మానవ వనరులు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం వల్ల హైదరాబాదు దేశ పారిశ్రామిక ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా ఎదగగలదని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ను భవిష్యత్ పరిశ్రమల హబ్‌గా అభివృద్ధి చేయడానికి హైడ్రోజన్ టెక్నాలజీ ఆధారంగా గ్రీన్ స్టీల్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఆటోమొబైల్, రక్షణ రంగాలకు అవసరమైన అధునాతన ఉత్పత్తుల తయారీ యూనిట్లు స్థాపించాలని కూడా కోరారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం అత్యవసరమని ఆయన వివరించారు.  మెషిన్ టూల్స్, రోబోటిక్స్, ఆటోమేషన్ వంటి ఆధునిక రంగాల కోసం ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ధి చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ పార్క్ ద్వారా హైటెక్ తయారీ రంగంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్‌ను 2034 నాటికి కాలుష్యరహిత నగరంగా మార్చే దిశగా కూడా సీఎం దృష్టి సారించారు. ఇందుకోసం సంప్రదాయ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్పిడి చేయడానికి కేంద్ర సహకారం అవసరమని కోరారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను కూడా పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌కు మార్చే ప్రణాళికలను ఆయన సూచించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరాజు, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. 

Read More...

తెలంగాణ అసెంబ్లీలో తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు ఆమోదం !


తెలంగాణ అసెంబ్లీ తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో అధికారికంగా ప్రకటన చేశారు. 'తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగి జీతంలో 15శాతం కోసం కోత విధించి ఆ మొత్తాన్ని నేరుగా ఉద్యోగి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేలా చట్టాన్ని రూపొందించామని తెలిపారు. పిల్లల్ని కనగలం, వారి బుద్ధుల్ని మనం కనలేం అన్నట్లుగా ఉంది కొందరి వ్యవహారం. సామాజిక బాధ్యతగా మా ప్రభుత్వం తల్లిదండ్రుల కోసం ఈ చట్టం తెచ్చింది. భక్తితో లేదా భయంతో తల్లిదండ్రుల్ని చూసుకోవాలన్నదే మా ఆలోచన. ప్రేమలు పంచాల్సి చోట చట్టం తేవడం బాధగా ఉంది. తల్లిదండ్రుల్ని పట్టించుకోని ప్రతి కుమారికి బుద్ధి చెప్పే చట్టం ఇది. ఉద్యోగులే కాదు ప్రజా ప్రతినిధులు సైతం ఈ చట్టం కిందకి వస్తారు. తల్లిదండ్రుల్ని పట్టించుకోని కుమారులను సామాజిక బహిష్కరణ చేయాలి'అని ఆయన సూచించారు. 

Read More...

హరీష్ రావు కుటుంబ సభ్యుల భూ దోపిడీ మీద హౌస్ కమిటీకి సిద్ధమా?


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ మైనింగ్‌ అక్రమాలపై చర్చకు అవకాశం ఇచ్చాం. మైనింగ్‌ అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించాం. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కై విచారణ సాగనీయడం లేదు. సీబీఐ విచారణకు ఇస్తే ఇప్పటివరకు చర్యలు లేవంటూ మండిపడ్డారు. సీబీఐకి కాళేశ్వరం కేసు అప్పగించాక బీఆర్ఎస్ -బీజేపీ ఒప్పదం చేసుకుంది. నిన్న సమగ్ర చర్చ తర్వాతే సీబీసీఐడీ ఎంక్వరీ ప్రకటన చేశాం. సీబీ సీఐడీ ఎంక్వరీ ప్రకటన తర్వాత బీఆర్ఎస్ సభ్యులే కేటీఆర్, హరీష్‌రావును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. హరీష్ రావు కుటుంబ సభ్యుల భూ దోపిడీ మీద హౌస్ కమిటీకి సిద్ధమా?. హరీష్‌కు నిజాయితీ ఉంటే హౌస్‌ కమిటీకి సహకరించాలి'' అని రేవంత్‌రెడ్డి అన్నారు.

Read More...

రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా పథకం వర్తింపు !


తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి నేడు మీడియా ప్రతినిధుల చిట్ చాట్‌లో 5 లక్షల జీవిత బీమా పథకంపై స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఈ బీమా సౌకర్యం వర్తిస్తుందని ఆయన ప్రకటించారు. తెలంగాణలో పుట్టడం, ఇక్కడ జీవించడం ఒక వరంగా భావించేలా తమ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, సామాన్యుడి జీవితానికి భద్రత కల్పించడమే తమ లక్ష్యమని సీఎం వివరించారు. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈ ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం వివరాలను వెల్లడించారు. ఈ పథకం 2026, జూన్ 2వ తేదీ (తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం) నుంచి అధికారికంగా అమల్లోకి రానుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే, ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా ఈ ఐదు లక్షల రూపాయల బీమా సొమ్ము ఆదుకుంటుందన్నారు. పేద, మధ్యతరగతి అనే తేడా లేకుండా అందరికీ వర్తించేలా ఇంత భారీ స్థాయిలో జీవిత బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రభుత్వం గర్వంగా చెబుతోంది. సామాజిక అంతరాలు లేకుండా ప్రతి పౌరుడికి భద్రత కల్పించే ఇలాంటి మహత్తర పథకం ప్రపంచంలో మరెక్కడా లేదని మంత్రి భట్టి పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో కుటుంబాలు రోడ్డున పడకూడదనే మానవీయ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది. బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ, ప్రజలపై ఎలాంటి భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

Read More...

ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి "స్టాండ్ విత్ హర్" అంటూ మహిళలకు అండగా నిలవాలి !


తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ జేఎన్‌టీయూ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన "స్టాండ్ విత్‌ హర్" కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.  సీఎంతో పాటు నటుడు సాయి తేజ్, మంత్రులు, డీజీపీ శివధర్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో మహిళలకు అత్యున్నత పదవులు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని, దేశానికి రాష్ట్రపతిగా, ప్రధానమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా, ముఖ్యమంత్రులుగా మహిళలు సేవలందించే అవకాశం కాంగ్రెస్ కల్పించిందన్నారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తెలంగాణలో కూడా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వాన్ని ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. మహిళను మనం శక్తికి ప్రతీకగా భావిస్తామని, కానీ అలాంటి మహిళలకు సరైన రక్షణ కల్పించలేకపోతే అది సమాజానికి గౌరవం కాదన్నారు. మహిళల భద్రత, గౌరవం కోసం ప్రభుత్వం మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఇంతకు ముందు మహిళలపై వేధింపులు కొన్ని పరిమిత ప్రాంతాల్లోనే ఉండేవని, కానీ ఇప్పుడు సాంకేతికత అభివృద్ధి చెందడంతో సోషల్ మీడియా ద్వారా కూడా మహిళలు వేధింపులకు గురవుతున్నారని తెలిపారు. సైబర్ క్రైమ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని, అందుకే డిజిటల్ ప్రపంచంలో కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మహిళల రక్షణ కోసం చట్టాలు చేయడం, పోలీసులు పర్యవేక్షించడం మాత్రమే సరిపోదని, సమాజం మొత్తం దీనిని సామాజిక బాధ్యతగా తీసుకుంటేనే మహిళలపై జరిగే అన్యాయాలను పూర్తిగా అరికట్టవచ్చన్నారు. మన ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకు ఎలా గౌరవం ఇస్తామో, సమాజంలోని ప్రతి మహిళను కూడా అలాగే గౌరవించాలని కోరారు. మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలను మహిళల పేరుతోనే అందిస్తున్నామని తెలిపారు. దీనివల్ల మహిళలు కుటుంబంలో ఆర్థికంగా బలపడతారని ఆయన చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందిస్తూ మహిళలు స్వయం ఉపాధి పొందేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. శిల్పారామం వద్ద దుకాణ సముదాయాలను కేటాయించడం ద్వారా మహిళలు వ్యాపార రంగంలో ముందుకు రావడానికి అవకాశాలు కల్పించామని తెలిపారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగంలో కూడా మహిళలకు అవకాశాలు కల్పిస్తూ వారు పెద్ద వ్యాపార సంస్థలతో పోటీ పడే స్థాయికి ఎదగాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం అన్నారు. అలాగే మహిళలకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి ఆర్థికంగా ఎదగడానికి మార్గాలు కల్పిస్తున్నామని చెప్పారు. మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా వెయ్యి బస్సులకు మహిళలను యజమానులుగా చేసి వారికి ఆర్థిక స్వావలంబన కల్పించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి అయిలమ్మ పేరు పెట్టడం ద్వారా మహిళా శక్తికి గౌరవం చాటామని సీఎం పేర్కొన్నారు. మహిళల పోరాట స్పూర్తిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణను దేశంలోనే మహిళలకు అత్యంత భద్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో "స్టాండ్ విత్ హర్" కార్యక్రమాన్ని ప్రారంభించామని సీఎం తెలిపారు. మహిళలపై ఎక్కడైనా అన్యాయం జరిగితే సమాజం మొత్తం కలిసి వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మహిళల రక్షణ కోసం ప్రతి యువకుడు ఒక బ్రాండ్ అంబాసిడర్‌లా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలపై అన్యాయం జరిగితే ప్రశ్నించే ధైర్యం సమాజంలో పెరగాలని ఆయన సూచించారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా విద్య, వ్యాపారం, రాజకీయాలు, క్రీడలు, సాంకేతిక రంగాల్లో కూడా రాణించాలని ప్రభుత్వం కోరుకుంటోందని సీఎం తెలిపారు. మహిళల అభివృద్ధి ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. సోషల్ మీడియా పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ కూడా పెరుగుతోందని సీఎం పేర్కొన్నారు. అలాంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి "స్టాండ్ విత్ హర్" అంటూ మహిళలకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళల గౌరవం కాపాడితేనే సమాజం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Read More...

జాతీయ విద్యా విధానం తరహాలో ప్రత్యేక విద్యా విధానం : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి


తెలంగాణలో ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీ కోసం ఏర్పాటైన విద్యా కమిషన్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేసింది. ఇవాళ సచివాలయంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యావిధానంపైన 'ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ' పేరుతో ఉన్న నివేదికను సీఎంకు అందజేశారు.కాగా, జాతీయ విద్యా విధానం తరహాలోనే తెలంగాణలోనూ త్వరలోనే ప్రత్యేక విద్యా విధానం తీసుకురాబోతున్నామని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. విద్యా విధానం కోసం ఇప్పటికే ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించామని, త్వరలోనే ఆ పాలసీని అమలులోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా ప్రమాణాలను పెంచే లక్ష్యంతో సెప్టెంబరు 2024లో ప్రత్యేక తెలంగాణ విద్యా కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆకునూరి మురళి చైర్మన్‍గా ఏర్పాటైన ఈ కమిషన్ పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు నాణ్యత మెరుగుదల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల అభివృద్ధి వంటి అంశాలపై నివేదికలు సమర్పిస్తూ విద్యా సంస్కరణలకు కృషి చేస్తోంది. కమిషన్ నివేదిక అందిన నేపథ్యంలో త్వరలోనే తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకించే అవకాశం ఉంది. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి నూతన విద్యాపాలసీ రాష్ట్రంలో అమలులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read More...

బీఆర్ఎస్ వైఫల్యాల వల్లే జలాల రాజకీయం నడుస్తోంది !


తెలంగాణలోని ములుగు జిల్లా దేవాదుల ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిమాట్లాడుతూ గత పదేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, బీఆర్ఎస్ వైఫల్యాల వల్లే ఇప్పుడు జలాల రాజకీయం నడుస్తోందని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయలేని పరిస్థితి ఏర్పడిందని, కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారినా.. రాష్ట్రంలో వరి దిగుబడి మాత్రం తగ్గలేదని రేవంత్ రెడ్డి వివరించారు. కేసీఆర్, హరీశ్ రావుల తప్పులను ప్రజలు గమనించే గత ఎన్నికల్లో వారికి తగిన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. పదేళ్లలో ఏం జరిగింది, తమ ప్రభుత్వం ఏం చేస్తోందనే దానిపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చిస్తామన్నారు. నీటి జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తోందన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ అసంబద్ధమైన మాటలని కొట్టిపారేశారు. ఎన్నికల సమయంలోనే రాజకీయం ఉండాలని, ప్రజల ప్రయోజనాలు, నీళ్ల విషయంలో రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. ఓటు వేసిన ప్రజలనే తప్పు పట్టేలా బీఆర్ఎస్ నేతలు వ్యవహరించడం విచారకరమని, ప్రజల తీర్పును గౌరవించి విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు.

Read More...