3

అండర్-19 ఆసియా కప్ 2026 : భారత్ పై పాకిస్తాన్ విజయం

అండర్-19 ఆసియా కప్ 2026లో భాగంగా ఒమన్‌లోని అల్ అమెరాట్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో భారత్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ 48.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అర్జున్ రాజ్‌పుత్ వీరోచిత సెంచరీతో భారత్‌ను ఆదుకున్నప్పటికీ.. జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ కూడా ఒకానొక దశలో త్వరగానే వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అయితే వికెట్ కీపర్ బ్యాటర్ హమ్జా జహూర్ (108 బంతుల్లో 100 నాటౌట్: 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ సెంచరీతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అతనికి అండగా నిలిచిన హస్నైన్ అబ్బాస్ దార్(38) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్ కు ఏకంగా 107 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి పాకిస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత అండర్-19 జట్టు 46.3 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్ ప్రారంభంలోనే దెబ్బతింది. కెప్టెన్ లక్ష్య రాజేష్ రాయచందానీ(0), వీకే వినీత్(8), యశ్వర్ధన్ చౌహాన్(1) త్వరగానే వెనుదిరిగారు. ఆ తర్వాత ఆర్యవీర్ సెహ్వాగ్(22), వికెట్ కీపర్ అన్వయ్(10) కూడా తక్కువ పరుగులకే ఔట్ కావడంతో భారత్ 86 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జలంధర్ కుర్రోడు అర్జున్ రాజ్‌పుత్ (85 బంతుల్లో 107; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత పోరాటం కనబరిచాడు. కేవలం 80 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న అర్జున్ రాజ్‌పుత్.. మనల్ చౌహన్(11)తో కలిసి ఆరో వికెట్‌కు 64 పరుగులు జోడించాడు. చివర్లో కావ్య పటేల్(23) ఉపయోగకరమైన పరుగులు చేయడంతో భారత్ 208 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. పాక్ బౌలర్లలో అలీ రజా, రిజ్వానుల్లా, నికాబ్ షఫీక్ తలో 3 వికెట్లు పడగొట్టారు. హమ్జా జహూర్ సెంచరీతో ఈ ఉత్కంఠ పోరులో పాకిస్తాన్ విజయం సాధించగా.. భారత అండర్-19 జట్టు శ్రమకు ఫలితం దక్కలేదు. ఈ నెల 10న యూఏఈతో మ్యాచ్ గెలిస్చే ఇండియా సెమీస్ చేరుతుంది.

Related Post

Previous
Next Post »