3

మహిళ అందంగా కనిపిస్తే గూఢచర్యానికి ఒక సాధనంగా మారిందని అర్థం : విపరీతంగా ట్రెండ్ అవుతున్న ఎలాన్ మస్క్ పాత పోస్ట్

అమెరికా కృత్రిమ మేథ నాయకత్వానికి ఎన్వీడియా సీఈవో జెన్సన్ హువాంగ్ ఎంతో కీలకమంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. సిలికాన్ వ్యాలీ సమాచారాన్ని రాబట్టేందుకు కొందరు గూఢచారులు ట్రాప్‌లు వేస్తున్నారన్న వార్తలపై 2025 అక్టోబరు నెలలో మస్క్ స్పందిస్తూ, ఎవరైనా మహిళ అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తే, నువ్వు గూఢచర్యానికి ఒక సాధనంగా మారావని అర్థం అంటూ చమత్కరించారు. ఆ పాత పోస్ట్ ప్రస్తుతం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మరోవైపు, హువాంగ్ చేసిన పని వివాదాస్పదమైనప్పటికీ, అమెరికా ఏఐ ఆధిపత్యానికి ఆయన ఎంతో అవసరమని పేర్కొన్న ఒక పోస్ట్‌కు మస్క్ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఎన్వీడియా చీఫ్ జెన్సన్ హువాంగ్‌తో చైనా గూఢచారిణి అలైస్ హువాంగ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వార్త ఇపుడు టెక్ ప్రపంచంలో తెగ వైరల్ అవుతోంది. దీంతో అసలు అలైస్ హువాంగ్ ఎవరు ? ఆమెకు ఎన్వీడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌తో పరిచయం ఎలా ఏర్పడింది? అసలు ఆమె ప్రొఫైల్ ఏంటి? వంటి అనేక ఆసక్తికరమైన అంశాలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. చైనా జాతీయురాలైన అలైస్ హువాంగ్‌ అసలు పేరు హువాంగ్ లీ. సింగపూర్‌కి చెందిన మెగా స్పీడ్‌లో టాప్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. చైనీస్ ప్రైవేట్ ఫండ్ డేటా బేస్‌లో ఆమె వివరాలు లభ్యమయ్యాయి. టీవీ రిపోర్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన అలైస్, తొలుత హునాన్ టీవీలో ఆ తర్వాత ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీలో పనిచేశారు. అనంతరం హెచ్‌ఎస్‌బీసీ ప్రైవేట్ బ్యాకింగ్ డివిజన్ ప్రెసిడెంట్‌కు అసిస్టెంట్‌గా, సిటిక్ సెక్యూరిటీస్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా ఎదిగారు. షాంఘై హెక్సీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్‌ సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌, ఫండ్ మేనేజర్‌గా విధులు నిర్వర్తించారు. ఈ కంపెనీకి చైనీస్ గేమింగ్ కంపెనీ సెవెన్ రోడ్‌కు సంబంధం ఉన్నట్లు సమాచారం. మెగాస్పీడ్ కంపెనీ స్థాపించడం వెనక సెవెన్ రోడ్ ఉన్నట్లు తెలుస్తోంది. 2023లో మెగా స్పీడ్‌ను స్థాపించిన ఆమె అదే ఏడాది దానిని స్విఫ్ట్ డేటాకు విక్రయించారు. కానీ ఆ సంస్థతో సంబంధాలు కొనసాగించారు. ఇప్పుడు ఆ సంస్థ ఎన్విడియాకు ప్రధాన వ్యాపార భాగస్వామిగా ఉంది. మెగాస్పీడ్ గత రెండేళ్లలో 4.8 బిలియన్ డాలర్ల విలువైన ఎన్విడియా చిప్‌లను కొనుగోలు చేసింది. మరోవైపు, అలైస్ గురించి తాను ఎప్పుడూ వినలేదని హునాన్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఒకరు వెల్లడించారని అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. మరోవైపు సీసీటీవీ వెబ్‌సైట్‌లో ఆమె ప్రొఫైల్ ఏదీ లభించలేదని పేర్కొన్నట్లు తెలిపింది. దాంతో ఆమె ప్రొఫైల్ మిస్టరీగా మారింది. ఇప్పుడు చైనా స్పైగా అలైస్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Related Post

Previous
Next Post »