3

దేశంలోని పలు రాష్ట్రాల్లో ముస్లింలను విద్యకు దూరం చేయడానికి పక్కా వ్యూహం : కేంద్రంపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆరోపణలు

హైదరాబాద్‌లో ఎఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జాతీయ మీడియాతో మాట్లాడుతూ దేశంలోని పలు రాష్ట్రాల్లో ముస్లింలను విద్యకు దూరం చేయడానికి పక్కా వ్యూహంతో కుట్ర జరుగుతోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలను ఆధారంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో వందలాది ముస్లిం జనాభా ఉన్న గ్రామాల్లో కనీసం ఒక్క ప్రాథమిక పాఠశాల కూడా లేకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తాను చెబుతున్న సొంత సమాచారం కాదని.. స్వయంగా భారత ప్రభుత్వమే వెల్లడించిన అధికారిక డేటా అని అసదుద్దీన్ ఒవైసీ ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్‌ లో ముస్లిం జనాభా 19.26 శాతంగా ఉందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. 2021-22 ప్రభుత్వ డేటా ప్రకారం.. ప్రాథమిక విద్యలో ముస్లిం పిల్లల చేరికలు 17.3 శాతంగా ఉందని తెలిపారు. అయితే ఇది సెకండరీ స్థాయికి వచ్చేసరికి 12.6 శాతానికి, హయ్యర్ సెకండరీకి వచ్చేసరికి 11.4 శాతానికి ఘోరంగా పడిపోతోందని పేర్కొన్నారు. పాఠశాల విద్య పూర్తయ్యేసరికే ఇన్ని విద్యా సంవత్సరాల వ్యవధిలో పిల్లలు బడికి దూరమవడానికి కారణమెవరు..? కచ్చితంగా ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ముస్లిం విద్యార్థుల విద్యావకాశాలను మెరుగుపరచడానికి, తగిన చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖత చూపడం ఒవైసీ మండిపడ్డారు. ఒకవైపు తగినన్ని పాఠశాలలు అందుబాటులో లేకపోగా, మరోవైపు విద్యాభ్యాసానికి అనుకూలమైన సురక్షితమైన వాతావరణం కూడా అక్కడ కనిపించడం లేదన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ ముస్లింలను విద్యావ్యవస్థకు, ఉన్నత చదువులకు దూరం చేయడమే లక్ష్యంగా కుట్రపూరితమైన ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఇప్పటికైనా మైనారిటీ వర్గాల విద్యాభివృద్ధికి ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని, విద్యా హక్కు అందరికీ సమానంగా అందేలా చూడాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు.

Related Post

Previous
Next Post »