బీఈఎంఎల్ తయారీ కేంద్రంలో రూపొందుతున్న బుల్లెట్ ట్రైన్ : భారతీయ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా స్వదేశీ ఇంజనీరింగ్ నైపుణ్యం

కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న బీఈఎంఎల్ తయారీ కేంద్రంలో దేశంలోనే తొలి బుల్లెట్ ట్రైన్ ను రూపొందిస్తున్నారు. అధునాతన సాంకేతికత, వేగం, ప్రయాణికుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందిస్తున్నారు. భారతీయ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా స్వదేశీ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ఇందులో ఉపయోగిస్తున్నారు. ఈ బుల్లెట్ రైలు గరిష్టంగా గంటకు 280 కిలోమీటర్ల వేగంతో పరీక్షలు నిర్వహించే సామర్థ్యంతో రూపొందించారు. సాధారణ కార్యకలాపాల సమయంలో గంటకు 249 కిలోమీటర్ల వేగంతో నడపాలని ప్రణాళిక. రైలు మొత్తం పొడవు సుమారు 202 మీటర్లు ఉంటుంది. ఇందులో మొత్తం ఎనిమిది కోచ్‌లు ఉంటాయి. నాలుగు మోటార్ కార్లు, నాలుగు ట్రైలర్ కార్లతో ఈ రైలును రూపొందించారు. ఒకేసారి సుమారు 557 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. వీరిలో దివ్యాంగులు, శారీరక ఇబ్బందులు ఉన్నవారి కోసం ప్రత్యేకంగా రెండు సీట్లు కేటాయించారు. ఈ రైలులో ఏడు స్టాండర్డ్ క్లాస్ కోచ్‌లు, ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్‌లో 3×2 సీటింగ్ విధానం, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో 2×2 సీటింగ్ ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ప్రయాణికుల రద్దీ పెరిగితే రెండు ఎనిమిది కోచ్‌ల రైళ్లను కలిపి 16 కోచ్‌ల రైలుగా నడిపే అవకాశం కూడా ఉంటుంది. ఈ రైలులో సీట్ల నుంచి లైటింగ్ వరకు ప్రతి అంశాన్ని ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. భారతీయుల శరీర కొలతలకు అనుగుణంగా సీట్ల డిజైన్ చేశారు. ఎక్కువ దూరం ప్రయాణించినా ఇబ్బంది కలగకుండా తగినంత లెగ్‌రూమ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి సీటు వరుసకు విశాలమైన కిటికీలు, ఎల్ఈడీ లైటింగ్, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్ల కోసం పవర్ అవుట్‌లెట్లు ఏర్పాటు చేశారు. చిన్న బ్యాగులను ఉంచుకునేందుకు పైభాగంలో లగేజీ ర్యాక్‌లు ఉంటాయి. పెద్ద బ్యాగులు, సూట్‌కేసుల కోసం ప్రత్యేక లగేజీ స్టాండ్లు కూడా ఏర్పాటు చేశారు. ఆధునిక బయో-డైజెస్టర్ టాయిలెట్లు అందుబాటులో ఉంటాయి. బోగీల మధ్య ప్రయాణికులు సులభంగా వెళ్లేందుకు సీల్ చేసిన గ్యాంగ్‌వేను రూపొందించారు. డ్రైవర్ క్యాబ్‌లు కూడా ఆధునిక ఆన్‌బోర్డ్ కంట్రోల్ సిస్టమ్‌తో పనిచేస్తాయి. దీనివల్ల రైలు నిర్వహణ, ఆపరేషన్ కంట్రోల్ సెంటర్‌తో సమన్వయం సులభమవుతుంది. ప్రయాణికులకు రైలు ప్రయాణానికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అందించేందుకు ప్రత్యేక ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది. బోగీల్లో ఏర్పాటు చేసే ఎల్ఈడీ స్క్రీన్లపై ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో వివరాలు ప్రదర్శిస్తారు. పబ్లిక్ అడ్రస్, ఆటోమేటిక్ అనౌన్స్‌మెంట్ వ్యవస్థల ద్వారా కూడా ప్రకటనలు చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు రైలు సిబ్బందితో మాట్లాడేందుకు క్యాబిన్లు, వెస్టిబ్యూల్స్‌లో ఎమర్జెన్సీ టాక్‌బ్యాక్ సదుపాయం ఉంటుంది. వైఫై ఆధారిత ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ ద్వారా ముందుగానే అందుబాటులో ఉంచిన సమాచార, వినోద కంటెంట్‌ను కూడా యాక్సెస్ చేయవచ్చు.

Post a Comment

Previous Post Next Post
3