హైదరాబాద్ నగరంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ముసుగులో అమాయక యువతుల నుంచి అక్రమంగా అండాలు సేకరించి, ఫెర్టిలిటీ సెంటర్లకు విక్రయిస్తున్న ముఠా ఆటను సరూర్‌నగర్ పోలీసులు కట్టించారు. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో 'శెట్టి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్' పేరుతో దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఈ దందాను నడిపిస్తున్నాడు. బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి వివిధ రాష్ట్రాలకు చెందిన పేద యువతులకు డబ్బు ఆశ చూపి హైదరాబాద్‌కు రప్పించేవారు. వారికి బస కల్పించినట్లే నమ్మించి, నెలనెలా వారి శరీరం నుండి అండాలు సేకరించి, ఫెర్టిలిటీ సెంటర్లకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. పక్కా సమాచారంతో దాడులు చేసిన సరూర్‌నగర్ పోలీసులు దుర్గాప్రసాద్‌తో పాటు మరో 8 మందిని అరెస్టు చేశారు. హాస్టల్‌లో ఉన్న 15 మంది యువతులను రక్షించి, ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం భద్రత కోసం రక్షణ గృహాలకు తరలించారు. ఈ అక్రమ నెట్‌వర్క్ కార్యకలాపాలు మొదట బేగంపేట ప్రకాష్‌నగర్‌లో వెలుగు చూశాయి. అమీ నీతా గర్ల్స్ హాస్టల్ పేరుతో ఓ అపార్ట్‌మెంట్‌లో 8 నుండి 10 మంది యువతులను ఉంచి గతేడాది కాలంగా అండాలు సేకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ లభించిన ఆధారాల మూలాలను తవ్వడంతోనే సరూర్‌నగర్ లింకులు బయటపడ్డాయి. ఈ దందా తీరుతెన్నులపై మల్కాజ్‌గిరి సీపీ సుమతి స్పందిస్తూ కీలక వివరాలు వెల్లడించారు. ఇందౌర్‌కు చెందిన అమిత్ శర్మ ఈ దందాకు మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించాడు. బేగంపేటకు చెందిన నిఖత్ పర్వీన్ పేద యువతులను ఆకర్షించి తీసుకువచ్చే పని పూర్తిచేసేది. రెజిమెంటల్ బజార్‌కు చెందిన రేష్మా ఖతూన్ సేకరించిన అండాలను ఐవీఎఫ్ సెంటర్లకు అనుసంధానించే బాధ్యత తీసుకుంది. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని యువతుల ఆరోగ్యం, ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ నెట్‌వర్క్‌పై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.
అమాయక యువతుల నుంచి అక్రమంగా అండాలు సేకరించి ఫెర్టిలిటీ సెంటర్లకు విక్రయిస్తున్న ముఠా : గుట్టును రట్టు చేసిన పోలీసులు
byTelugu Lo Computer
•
•
2 min read
