క్షణికావేశంలో భర్తను కూరగాయలు కోసే కత్తితో పొడిచి చంపిన భార్య

హైదరాబాద్‌లోని కొత్తపేట పరిధిలో  భార్య కూరగాయలు కోసే కత్తితో భర్తను ఛాతీపై బలంగా పొడవడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చైతన్యపురి పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన కొటెం ప్రభాకర్ తన భార్య రజిత, ఇద్దరు కుమార్తెలతో కలిసి కొంతకాలం క్రితం ఉపాధి నిమిత్తం నగరానికి వలస వచ్చాడు. కొత్తపేట సత్యనగర్ కాలనీలోని గాయత్రి ప్రణవం ఎలైట్ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నంబర్ 501లో అద్దెకు ఉంటున్నాడు. ప్రభాకర్ అదే అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో నిన్న ఉదయం సుమారు 9:20 గంటల సమయంలో కుటుంబ విషయాలపై భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగింది. వాగ్వాదం ముదరడంతో విచక్షణ కోల్పోయిన భార్య ఇంట్లోని కూరగాయలు కోసే కత్తితో భర్త ప్రభాకర్ ఛాతీపై బలంగా పొడిచింది. తీవ్ర రక్తస్రావంతో ప్రభాకర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తండ్రి రక్తపు మడుగులో పడిపోవడాన్ని చూసి భయాందోళనకు గురైన కుమార్తెలు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. తీవ్ర గాయాలపాలైన ప్రభాకర్‌ను సమీపంలోని కొత్తపేట ఓమ్ని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు పరీక్షించిన వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తమ్ముడు కొటెం విజయభాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేశారు. నిందితురాలు రజితను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. 

Post a Comment

Previous Post Next Post
3