ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా నిలిచారు. ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న నిరసన మార్చ్‌లో ఆయన పాల్గొననున్నారు.ఢిల్లీ బయలుదేరే ముందు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా వేదికలు ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలను పంచుకున్నారు. ఎక్స్‌లో పోస్టు చేసిన వీడియోలో ఎలాంటి మాటలు మాట్లాడకుండా చేతి సంజ్ఞలతో తాను బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిపారు. అనంతరం ప్రజలు కూడా రామ్‌లీలా మైదానానికి చేరుకుని నిరసన మార్చ్‌లో పాల్గొనాలని సంకేతాల ద్వారా పిలుపునిచ్చారు. ఒకరోజు ముందే విడుదల చేసిన మరో వీడియోలో ప్రకాశ్ రాజ్ వ్యంగ్యంగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ చాలామంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపే బదులు సోషల్ మీడియాలో పోస్టులు, ట్వీట్లు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కనీసం తమ పోస్టులకు వస్తున్న కామెంట్లను అయినా చదువుతున్నారా అంటూ ప్రశ్నించారు. నవంబర్ 1న ఢిల్లీలో భారీ శాంతియుత నిరసన మార్చ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని, సర్ ప్రక్రియను రద్దు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఓటు హక్కుల పరిరక్షణే ఈ ఉద్యమ లక్ష్యమని చెప్పారు. ఓటు దొంగతనానికి పాల్పడుతున్నవారికి దేశం మౌనంగా ఉండబోదనే సందేశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఢిల్లీలో ఆదివారం రాజకీయ కార్యక్రమాల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ర్యాలీ నిర్వహిస్తుండగా, పశ్చిమ ఢిల్లీలో బీజేపీ ప్రతిమార్చ్ చేపట్టింది. ఈ రెండు కార్యక్రమాల నేపథ్యంలో మధ్య, న్యూఢిల్లీ ప్రాంతాల్లో సుమారు 10 వేల మంది పోలీసు సిబ్బంది, పారామిలటరీ బలగాలను మోహరించారు.
