రీపోలింగ్‌లోనూ ఘర్షణలు, ఉద్రిక్తతలు

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల రీపోలింగ్ జరుగుతున్న పలు చోట్ల నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నిన్న జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్, బూత్ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం 13 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశించించింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా రీ పోలింగ్ ప్రక్రియ చేపట్టారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 13 కేంద్రాల్లో రీ పోలింగ్ కొనసాగనుంది. అనంతపురం కార్పొరేషన్‌లోని 30వ డివిజన్‌లో 3వ నంబర్ పోలింగ్ కేంద్రం, తిరుపతి 36వ డివిజన్‌లో 4వ నంబర్ పోలింగ్ కేంద్రం, కడప నగరపాలక సంస్థ 15వ డివిజన్‌లోని 2వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే మాచర్ల మున్సిపాలిటీలోని 23వ వార్డులో 1, 2వ పోలింగ్ కేంద్రాలు, ప్రకాశం జిల్లా చీమకుర్తి పురపాలక సంఘం 14వ వార్డులోని 1వ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ కొనసాగుతోంది. జమ్మలమడుగు మున్సిపాలిటీలోని 3వ వార్డులో 2వ పోలింగ్ కేంద్రంతో పాటు 17, 29వ వార్డుల్లోని 1వ నంబర్ పోలింగ్ కేంద్రాల్లోనూ రీపోలింగ్ చేపట్టారు. పులివెందుల మున్సిపాలిటీలోని 1, 3, 7, 8వ వార్డుల్లోని 1వ నంబర్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అనంతపురంలోని 30వ డివిజన్‌లోని 3 నంబర్ పోలింగ్ కేంద్రంలో కూటమి నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో ఇక్కడ తిరిగి పోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే సోమవారం ఉదయం రీపోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే మరోసారి వివాదం చెలరేగింది. పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని, బయటి వ్యక్తులు వచ్చారంటూ ఇరు వర్గాలు ఆరోపణలు చేసుకోవడంతో వాగ్వాదం మొదలైంది. అది కాస్తా తోపులాటకు దారితీసింది. దీంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రీపోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు, పోలీసులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post
3