తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం పాలనలో రాష్ట్ర అభివృద్ధి వెనుకబడిపోతోందని డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. అన్ని రంగాల్లోనూ తమిళనాడు రివర్స్ గేర్‌లోకి వెళ్లిందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని, జీఎస్టీ ఆదాయ వృద్ధి కూడా తగ్గిందని విమర్శిస్తూ సోమవారం సోషల్ మీడియా ఖాతా 'ఎక్స్'లో ఒక పోస్టు పెట్టారు. ఉదయం తాను గమనించిన రెండు వార్తలను ప్రస్తావిస్తూ టీవీకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.తమిళనాడు జీఎస్టీ ఆదాయ వృద్ధి జాతీయ సగటు కంటే దిగువకు పడిపోయిందని స్టాలిన్ పేర్కొన్నారు. టీవీకే ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి దెబ్బతింటోందని ఆరోపించారు. ఈ పరిస్థితి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. తమిళనాడుకు రావాల్సిన రూ.1,614 కోట్ల విలువైన దక్షిణ కొరియా పెట్టుబడులు టీవీకే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోయాయని స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకంగా పనిచేసిన 'గైడెన్స్ తమిళనాడు' సంస్థను కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. వ్యక్తుల అహంకారానికి ఈ సంస్థ బలైపోయిందని వ్యాఖ్యానించారు. అన్ని రంగాల్లోనూ ఇంత వేగంగా రివర్స్ గేర్‌లోకి వెళ్లడం ఎలాగో టీవీకే ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలని స్టాలిన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అవగాహన లేని ముఖ్యమంత్రి విజయ్ మాత్రం ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలకు అభివాదాలు చేస్తూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని విమర్శించారు.తమిళనాడు అభివృద్ధికి కష్టకాలం మొదలైందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్టాలిన్ తన పోస్టులో పేర్కొన్నారు.
టీవీకే ప్రభుత్వం పాలనలో రాష్ట్ర అభివృద్ధి రివర్స్ గేర్‌లోకి వెళ్లింది : 'ఎక్స్'లో పోస్టు పెట్టిన మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్
byTelugu Lo Computer
•
•
2 min read
