తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచలనం సృష్టించిన జోగిని సుధాకర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. చౌటుప్పల్‌లో నిన్న జరిగిన ఈ హత్యకు సంబంధించి 24 గంటల్లోపే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నగలు, నగదు కోసమే సుధాకర్‌ను హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రెండు నెలల క్రితం జోగిని సుధాకర్ అస్సాం వెళ్లిన సమయంలో పవన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తర్వాత పవన్ సుధాకర్‌కు శిష్యుడిగా చేరాడు. పవన్‌తో పాటు హర్ష, సంతోష్ పాండే కూడా సుధాకర్ శిష్యులుగా మారారు. కొద్దిరోజుల క్రితం ఈ ముగ్గురూ సుధాకర్ ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో సుధాకర్ వద్ద ఉన్న నగలు, నగదుపై కన్నేసిన ముగ్గురూ ఆయనను హత్య చేయాలని పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు. పథకం ప్రకారం సుధాకర్‌ను హత్య చేసిన నిందితులు జోగిని కారులోనే నగలు, నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనను సవాల్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టి, పక్కా ఆధారాలతో 24 గంటల్లోనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని నిందితుల నుంచి 130 తులాల బంగారం, 3 కేజీల 600 గ్రాముల వెండి, రూ.9 లక్షల నగదు, ఒక కారుతో పాటు హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ వెల్లడించారు.
జోగిని హత్య కేసు : 24 గంటల్లోపే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు : కారుతో పాటు నగదు, బంగారం, వెండి స్వాధీనం
byTelugu Lo Computer
•
•
2 min read
