తెలంగాణ లోని మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం క్వారీ గుట్టల్లో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందారు. ఆదివారం సెలవు దినం కావడంతో యాప్రాల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు మల్కారం క్వారీ గుట్టల వద్దకు సరదాగా గడిపేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఈత కొట్టేందుకు క్వారీలోని నీటిలోకి దిగిన ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగిపోయారు. మృతులు సీవిఆర్ కాలేజీలో చదువుతున్న రోహిత్ (18), సీఎంఆర్ కాలేజీలో చదువుతున్న సయాన్ (18)గా గుర్తించారు. సమాచారం అందుకున్న జవహర్‌నగర్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. హైడ్రా, డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించి నీటిలో గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసేందుకు సిబ్బంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇద్దరు విద్యార్థుల మృతితో కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
