3

గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో వెబ్‌ల్యాబ్స్ అభివృద్ధి చేసిన స్పోర్ట్-ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ ప్రారంభం

హైదరాబాద్ లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో వెబ్‌ల్యాబ్స్ అభివృద్ధి చేసిన స్పోర్ట్-ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ ను రాష్ట్ర సమాచార సాంకేతికత, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబుతో పాటు భారతీయ మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్ చాముండేశ్వరనాథ్ , భారత మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, పుల్లెల గోపీచంద్ లు  ఆవిష్కరించారు. స్పోర్ట్-ఈ సాప్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ క్రీడా వేదికలు, స్పోర్ట్స్ అకాడమీల నిర్వహణను మరింత సులభతరం చేసే దిశగా రూపొందింది. ఈ సందర్భంగా పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ, "క్రీడా మౌలిక సదుపాయాలు సమర్థవంతంగా పనిచేయాలంటే తెరవెనుక బలమైన నిర్వహణ వ్యవస్థ అవసరం. SportE ద్వారా క్రీడా వేదికలను నిర్వహించే వారికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నాం. తద్వారా వారు పరిపాలనా అంశాల కంటే క్రీడాకారులు, క్రీడా సమాజ అభివృద్ధిపై మరింత దృష్టి సారించగలుగుతారు" అని అన్నారు. అలాగే, ప్రతి క్రీడా వేదికకు తనదైన బ్రాండ్ గుర్తింపును ఏర్పరచుకోవడంతో పాటు, వినియోగదారులతో దీర్ఘకాలిక సంబంధాలను పెంపొందించుకునే అవకాశం ఉండాలని ఆయన పేర్కొన్నారు. స్పోర్ట్-ఈ ఈ లక్ష్య సాధనకు దోహదపడుతుందని, క్రీడా సదుపాయాల నిర్వాహకులు ఈ ప్లాట్ఫామ్ను పరిశీలించి తమ సంస్థల అభివృద్ధికి వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. స్పోర్ట్-ఈ లో ఆయన భాగస్వామి, మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ పునాటి, శ్యామ్ కతురోజుతో కలిసి ప్రారంభించిన ఈ వెంచర్ క్రీడా రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత బలోపేతం చేయాలనే ఉమ్మడి లక్ష్యంతో ముందుకు సాగుతోందని గోపిచంద్ అన్నారు. స్పోర్ట్-ఈ లోని 'E' అంటే 'Ecosystem' అని, క్రీడా మౌలిక సదుపాయాలు, కోచింగ్, క్రీడాకారుల భాగస్వామ్యం, వ్యాపార కార్యకలాపాలను ఒకే వ్యవస్థతో అనుసంధానించడమే దీని విస్తృత లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా SportE ప్రతినిధి శ్రీకాంత్ పునాటి మాట్లాడుతూ, క్రీడా సదుపాయాల నిర్వాహకులు తమ బ్రాండ్ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసుకుని, అందులో తమ సౌకర్యాలను ప్రదర్శించడంతో పాటు ఆన్‌లైన్ బుకింగ్‌లను కూడా స్వీకరించవచ్చని వివరించారు. తద్వారా ప్రతి సంస్థకు ప్రత్యేక డిజిటల్ గుర్తింపు లభించడంతో పాటు మార్కెటింగ్, ప్రచారం, వినియోగదారులతో అనుబంధాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ ప్లాట్ఫామ్‌లో అందుబాటులో ఉండే సెంట్రలైజ్డ్ డ్యాష్‌బోర్డ్ ద్వారా బుకింగ్ రికార్డులు, కస్టమర్ల వివరాలు, చెల్లింపులను ఒకే చోట నిర్వహించుకోవచ్చు. వివిధ వ్యవస్థల మధ్య సమన్వయం కోసం మాన్యువల్గా చేసే పనులను తగ్గించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా, తమ సొంత పేమెంట్ గేట్వేను అనుసంధానించుకోవడంతో పాటు, అందుబాటులో ఉన్న ఇతర బుకింగ్ అగ్రిగేటర్లతోనూ అనుసంధానం చేసుకునే సదుపాయం కల్పించారు. దీనివల్ల తమ డేటాపై పూర్తి నియంత్రణను కొనసాగిస్తూ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అనలిటిక్స్, రిపోర్టింగ్ సదుపాయాలను కూడా ప్రవేశపెట్టనున్నారు. వీటి ద్వారా కార్యకలాపాల తీరును విశ్లేషించడం, పనితీరు ధోరణులను అంచనా వేయడం, మెరుగుదల అవసరమైన అంశాలను గుర్తించడం సాధ్యమవుతుంది. తద్వారా క్రీడా సంస్థల నిర్వాహకులు మరింత సమర్థవంతమైన వ్యాపార నిర్ణయాలు తీసుకునేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడుతుందని వివరించారు.

Related Post

Previous
Next Post »