మురసు తుఫాను : అధికారులు, కలెక్టర్లతో తుఫాను సన్నద్ధతపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతిలోని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ నుంచి అధికారులు, కలెక్టర్లతో తుఫాను సన్నద్ధతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల పరిధిలో 30 నుంచి 50 టీంఎసీల వరకు నీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తుఫాను గాలులతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 8 వేల వరకు విద్యుత్‌ స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అర్నబ్‌ తుపాను విధ్వంసం నుంచి చాలా ప్రాంతాలు సాధారణ స్థితికి వచ్చాయని, మురసు ప్రభావాన్ని కూడా సమర్థంగా ఎదుర్కోవాలని సీఎం స్పష్టం చేశారు. తుపాను వర్షాలను నీటి వనరుల పెంపునకు వినియోగించుకోవాలని సీఎం సూచించారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం జిల్లాలతోపాటు రాయలసీమ పరిధిలోని చెరువులు, రిజర్వాయర్లను సమర్థ నీటి నిర్వహణతో నింపాలని సీఎం నిర్దేశించారు. మురసు తీవ్ర తుఫాను ప్రభావం దృష్ట్యా బాపట్ల జిల్లాలోని విద్యా సంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు. ఈ తుఫాను ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కలెక్టర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. సూర్యలంక బీచ్‌కు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తుఫాను ప్రభావిత జిల్లాల్లో అధికారులు కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. అత్యవసర సమయంలో 9440827526 (గుంటూరు), 9281413774 (బాపట్ల) నంబర్లకు ఫోన్‌ చేయవచ్చని తెలిపారు. మరోవైపు మురసు తీవ్ర తుపాను గత 6 గంటల్లో 22 కి.మీ వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం నెల్లూరుకు 110 కి.మీ, కావలికి 130 కి.మీ, తిరుపతికి రూ.160 కి.మీ, ఒంగోలుకు 170 కి.మీ, బాపట్లకు రూ.190 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. దక్షిణ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. మురసు తీవ్ర తుఫాను నేపథ్యంలో ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాలకు అధికారులు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్‌ వద్ద అధికారులు 10వ నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సోమవారం అర్థరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము సమయంలో ఒంగోలు సమీపంలో మురసు తీరం దాటే అవకాశముంది.

Post a Comment

Previous Post Next Post
3