కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఆయనను సీఈసీ పదవి నుంచి తొలగించడం ఖాయమని, భవిష్యత్తులో జైలుకు వెళ్లాల్సి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కొన్నేళ్లుగా ఓటు చోరీ జరుగుతోందని ఆరోపించిన రాహుల్, ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని మండిపడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు మధ్యప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఓట్ల అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అత్యంత కీలకమైనవని, అలాంటి ఎన్నికల ప్రక్రియపైనే అనుమానాలు కలిగే పరిస్థితులు ఏర్పడటం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం పనితీరు, ఎన్నికల పారదర్శకతపై రాహుల్ గాంధీ తన విమర్శలను మరింత తీవ్రతరం చేశారు. ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్న విషయాన్ని ఎన్నికల సంఘమే వెల్లడిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలను భారత్ అంగీకరించబోదని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి ఎవరినీ అనుమతించబోమని హెచ్చరించారు.
