3

ఏలూరు జిల్లాలో ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు

ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా లోని పలు మండలాల్లో వాగులు,వంకలు,నదులు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా పెద్దవాగుకు ఆకస్మికంగా భారీ వరద నీరు వచ్చి చేరడంతో ముంపు గ్రామాల్లోని ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పోలీస్ యంత్రాంగం రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. వేలేరుపాడు మండలంలో ముమ్మరంగా రక్షణ చర్యలు, తెలంగాణ ఎగువ ప్రాంతాల నుండి పెద్దవాగు ప్రాజెక్టుకు వస్తున్న భారీ ఇన్-ఫ్లో కారణంగా వేలేరుపాడు మండలంలో వరద ముప్పు తీవ్రమైంది, వరదల్లో చిక్కుకున్న కమ్మరిగూడెం, మేడేపల్లి, అల్లూరి నగర్, కోయ మాధవరం గ్రామ ప్రజలను కుక్కునూరు సీఐ బాల సురేష్ బాబు, వేలేరుపాడు ఎస్సై నవీన్ కుమార్ మరియు వారి సిబ్బంది అత్యంత చాకచక్యంగా సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించారు. జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం సమీపంలో ఎగువ నుంచి వచ్చిన ఉధృత వరద ప్రవాహానికి జాతీయ రహదారి కొట్టుకుపోయింది. రహదారి తెగిపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.ఘటనా స్థలానికి చేరుకున్న జీలుగుమిల్లి ఎస్ ఐ క్రాంతి కుమార్,స్టేషన్ సిబ్బంది వాహనాలను దారి మళ్లిస్తూ,ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలు చేపడుతున్నారు. బుట్టాయిగూడెం మండలం పులి రామన్నగూడెంలో స్థానిక వాగులు,వంకలు ప్రమాదకరంగా పొంగిపొర్లుతున్నాయి.దీంతో సమీప గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.వాగులు,వంకలు దాటే సమయంలో వరద ఉధృతిని అంచనా వేయకుండా ఎవరూ రోడ్లపైకి, నీటి ప్రవాహాల్లోకి రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్న పిల్లలను, వృద్ధులను వరద నీటి సమీపానికి వెళ్లకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉంచాలని స్పష్టం చేశారు.అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ప్రజలు వెంటనే స్థానిక అధికారులను లేదా పోలీస్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించి సహాయం పొందాలని కుక్కునూరు సీఐ మరియు వేలేరుపాడు ఎస్సైలు కోరారు.

Related Post

Previous
Next Post »