మెడికల్ షాపు ఉద్యోగి ఖాతాలో రూ. 10,000 కోట్లు ఫ్రీజ్ !

రాజస్థాన్ రాష్ట్రం సికర్ ప్రాంతంలోని ఓ మెడికల్ షాపులో పనిచేస్తున్న ఓ యువకుడు తన బ్యాంక్ అకౌంట్ వివరాలు చూసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన బ్యాంక్ ఖాతాలో ఉన్న 10,000 కోట్ల రూపాయలకు పైగా నగదును ఫ్రీజ్ చేసినట్లు వచ్చిన మెసేజ్ చూసి ఆ యువకుడు స్థాణువైపోయాడు. నెలకు కేవలం రూ. 10,000 జీతం తీసుకునే ఆ యువకుడికి ఈ వార్త తీవ్ర షాక్‌కు గురిచేసింది. సలాసర్ బస్టాండ్ సమీపంలోని నిర్మల్ మెడికల్ పాయింట్‌లో పనిచేస్తున్న సమీర్ ఖాన్ అనే ఆ యువకుడు, తన మొబైల్ నంబర్ రీఛార్జ్ చేసుకోవడం కోసం బ్యాంక్ యాప్ ఓపెన్ చేసి చూశాడు. అప్పుడు అతని ఖాతాలో బ్యాలెన్స్ 'సున్నా' అని చూపించింది. దీంతో కంగారుపడిన అతను, బ్యాంక్ లావాదేవీల వివరాలు పరిశీలించగా, తన ఖాతాలో రూ. 10,000 కోట్లకు పైగా నగదును బ్లాక్ చేసి ఉంచినట్లు తెలిసింది. వేల కోట్ల రూపాయలు ఫ్రీజ్ అవ్వడమే కాకుండా, అతను కొద్దికొద్దిగా కూడబెట్టుకున్న రూ. 55,000 సొంత డబ్బును కూడా వాడుకోలేకుండా బ్యాంక్ ఖాతాను పూర్తిగా స్తంభింపజేశారు. సొంత డబ్బు కూడా తీసుకోలేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమీర్ ఖాన్, వెంటనే ఈ విషయాన్ని మెడికల్ షాపు యజమాని ధీరజ్ శర్మ దృష్టికి తీసుకెళ్లాడు. ఎవరో పొరపాటున లేదా సాంకేతిక లోపం వల్ల ఇంత పెద్ద మొత్తాన్ని అతని ఖాతాలోకి బదిలీ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. బ్యాంక్ ఖాతాలో వేల కోట్లు వచ్చాయని సంతోషించాలో, లేక తాను కష్టపడి దాచుకున్న రూ. 55 వేలు వాడుకోలేకపోతున్నానని బాధపడాలో తెలియక ఆ యువకుడు తీవ్ర ఆందోళన చెందుతున్నాడు.

Post a Comment

Previous Post Next Post
3