ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ : నవంబర్ 3న ఫలితాలు వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠభరితంగా సాగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పర్వం ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఒకట్రెండు చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరగడంతో ఎన్నికల అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలోని 92 పట్టణ స్థానిక సంస్థల్లో పోటీ పడిన అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తు బ్యాలెట్ పెట్టెల్లో భద్రమైంది. నవంబర్ 3 ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు , నగర పంచాయతీలకు సంబంధించి విస్తృత స్థాయిలో పోలింగ్ ఏర్పాట్లు చేశారు. 8 ప్రాంతాల్లో ఇప్పటికే చైర్‌పర్సన్‌లతో పాటు కౌన్సిలర్/కార్పొరేటర్ స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన చోట్ల ఉదయం 7 గంటల నుంచే ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. మొత్తం 99 లక్షల మంది ఓటర్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 11,000కు పైగా పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ ఎన్నికల ఓటింగ్ సరళిలో స్పష్టమైన వ్యత్యాసం కనిపించింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి ప్రధాన కార్పొరేషన్లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్దగా ఉత్సాహం చూపించకపోవడంతో అక్కడ పోలింగ్ శాతాలు మందకొడిగా నమోదయ్యాయి. మరోవైపు చిన్న పట్టణాలు, నగర పంచాయతీల్లో మాత్రం ఓటర్లు ఉదయం నుంచే క్యూలైన్లలో నిలబడి ఓట్లు వేశారు. 

Post a Comment

Previous Post Next Post
3