3

ఐసీఐసీఐ లైఫ్ బీఎస్ఈ 500 మొమెంటం క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ ను ఆవిష్కరించిన ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్

ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పెట్టుబడిదారులకు సరికొత్త ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ల లో భాగంగా ‘ఐసీఐసీఐ లైఫ్ బీఎస్ఈ 500 మొమెంటం క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్’ను ఆవిష్కరించింది. ఈ ఫండ్ ద్వారా బీఎస్ఈ 500 ఇండెక్స్‌లోని ఆర్థికంగా పటిష్టమైన, షేర్ల ధరల్లో సానుకూల వృద్ధి నమోదుచేస్తున్న 50 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా మొమెంటం (షేర్ల ధరల వృద్ధి ధోరణి), క్వాలిటీ (కంపెనీల ఆర్థిక నాణ్యత) అనే రెండు ప్రధాన అంశాల ఆధారంగా కంపెనీలను ఎంపిక చేస్తారు. రిటర్న్ ఆన్ ఈక్విటీ (ROE), డెట్ టు ఈక్విటీ నిష్పత్తి, ఎర్నింగ్స్ పర్ షేర్ వంటి ఆర్థిక ప్రమాణాలతో పాటు గత 12 నెలల షేర్ల పనితీరును పరిశీలించి పోర్ట్‌ఫోలియోను రూపొందిస్తారు. ఈ సందర్భంగా ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ మనీష్ కుమార్ మాట్లాడుతూ.. ఆర్థికంగా బలమైన వ్యాపారాలు నిర్వహిస్తూ, ఆదాయ వృద్ధికి అవకాశాలు కలిగిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో సంపదను పెంచుకోవడానికి ఈ ఫండ్ ఉపయోగపడుతుందని తెలిపారు. 2026 సెప్టెంబర్ 30 నాటికి బీఎస్ఈ 500 మొమెంటం క్వాలిటీ 50 ఇండెక్స్ ఏడేళ్ల వ్యవధిలో వార్షిక ప్రాతిపదికన 23.7 శాతం వరకు రాబడులు అందించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ పనితీరు ఆధారంగా ఏడేళ్ల క్రితం రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే దాని విలువ సుమారు రూ.4.4 లక్షలకు చేరేదని పేర్కొంది. అయితే గత పనితీరు భవిష్యత్తులోనూ ఇదే స్థాయిలో రాబడులకు హామీ ఇవ్వదు. మార్కెట్ పరిస్థితులు, కంపెనీల ఆర్థిక పనితీరుకు అనుగుణంగా ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియోను ప్రతి మూడు నెలలకోసారి రీబ్యాలెన్స్ చేస్తారు. తద్వారా మారుతున్న మార్కెట్ అవకాశాలకు అనుగుణంగా పెట్టుబడుల కేటాయింపులను సవరించనున్నారు. మరోవైపు 2027 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో తమ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 99.3 శాతంగా నమోదైందని, విచారణ అవసరం లేని క్లెయిమ్‌ల పరిష్కారానికి సగటున 1.1 రోజులు పట్టిందని ఐసీఐసీఐ లైఫ్ వెల్లడించింది. ఈ కొత్త ఇండెక్స్ ఫండ్‌ను ఐసీఐసీఐ లైఫ్ ప్రొటెక్ట్ ఎన్ గెయిన్, సిగ్నేచర్ అష్యూర్, సిగ్నేచర్, ప్లాటినం, వెల్త్ ఎలీట్ ప్రో వంటి పలు ULIP ప్లాన్ల ద్వారా పొందవచ్చని తెలిపింది. మరిన్ని వివరాలు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే ULIPలు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి కాబట్టి పెట్టుబడికి ముందు పాలసీ ఛార్జీలు, లాక్-ఇన్ నిబంధనలు, రిస్క్ వివరాలను పరిశీలించడం అవసరం.

Related Post

Previous
Next Post »