3

కోర్టు ధిక్కరణకు పాల్పడిన రంగారెడ్డి కలెక్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించిన హైకోర్టు

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా హైకోర్టు నిర్ధారించింది. జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు కలెక్టర్‌కు ఆరు నెలల పాటు సాధారణ జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే, అప్పీలు చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును నాలుగు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. రిజిస్ట్రేషన్‌ చట్టం-1908లోని సెక్షన్‌ 22-A ప్రకారం నిషేధిత ఆస్తుల జాబితా నుంచి కొన్ని ప్లాట్లను తొలగించాలంటూ బాధితులు దాఖలు చేసిన వినతిని పరిశీలించాలని గతంలో హైకోర్టు కలెక్టర్‌ను ఆదేశించింది. 2025 ఆగస్టులో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం 60 రోజుల్లోగా ఆ వినతిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే, కోర్టు నిర్దేశించిన 60 రోజుల గడువు ముగిసినప్పటికీ కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బాధితులు 2025 అక్టోబర్‌ 15న కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్ నమోదైన తర్వాతే యంత్రాంగం కదిలింది. అధికారులు బాధితులకు నోటీసులు జారీ చేసి, 2026 ఫిబ్రవరి 26న వారి వినతిని తిరస్కరించారు. ఆ తర్వాత జులై 8న మరోసారి తిరస్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైన తర్వాతే ఇలా ప్రక్రియను చుట్టేయడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఆదేశించిన సమయంలో స్పందించకుండా, పిటిషన్ దాఖలయ్యాక నామమాత్రంగానే ఉత్తర్వులు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన హైకోర్టు, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని నిర్ధారించింది. ఐఏఎస్ స్థాయి అధికారి కోర్టు ఉత్తర్వులను నిర్లక్ష్యం చేయడం సరైంది కాదని స్పష్టం చేస్తూ ధర్మాసనం కఠిన నిర్ణయం తీసుకుంది.


Related Post

Previous
Next Post »