3

వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా : 21 మంది మృతి, ప్రాణాలతో బయటపడిన ఒకరు

సెనెగల్‌ తీరంలో వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సెనెగల్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. దేశ వాయవ్య ప్రాంతంలోని కెబెమెర్‌ తీరానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వలసదారులు ప్రయాణిస్తున్న సంప్రదాయ ఫిషింగ్‌ పడవ (పిరోగ్‌) సముద్రంలో ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో పడవలో ఎంతమంది ఉన్నారనే వివరాలను అధికారులు వెల్లడించలేదు. ఈ ఘటనపై సెనెగల్‌ ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అధ్యక్షుడు, ప్రభుత్వం తరఫున అంతర్గత వ్యవహారాలు, ప్రజా భద్రత మంత్రి మృతులకు నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మనుషుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాలపై పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు పొరుగు దేశాలతో కలిసి పనిచేస్తామని ప్రకటించింది.  ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వలసల సంస్థ  తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ ఆఫ్రికా నుంచి యూరప్‌కు వెళ్లే వలసదారులకు అట్లాంటిక్‌ సముద్ర మార్గం ప్రధాన ప్రయాణ మార్గాల్లో ఒకటి. అయితే ఇది అత్యంత ప్రమాదకరమైనది. సెనెగల్‌, మొరాకో, మౌరిటానియా దేశాల్లో వలసదారుల ప్రయాణాలపై నిఘా, నియంత్రణలు పెరగడంతో కొందరు వలసదారులు దక్షిణం వైపు ఉన్న గాంబియా వంటి దేశాల నుంచి ప్రయాణం ప్రారంభిస్తున్నారు. దీనివల్ల సముద్ర ప్రయాణ దూరం మరో 750 కిలోమీటర్ల వరకు పెరుగుతోంది. కొన్ని ప్రయాణాలు సుమారు 2,200 కిలోమీటర్లకు చేరుకుంటున్నాయి. ఎక్కువ సమయం సముద్రంలో గడపాల్సి రావడం, నిఘా తక్కువగా ఉండే మారుమూల తీర ప్రాంతాల గుండా వెళ్లడం వల్ల పడవ ప్రమాదాలు, నీటి కొరత, గల్లంతయ్యే ముప్పు పెరుగుతోందని ఐఓఎం హెచ్చరించింది. 

Related Post

Latest
Previous
Next Post »