సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ప్రసంగించారు. తెలంగాణ సమాజం రాచరికాన్ని, పెత్తనాన్ని ఎన్నటికీ సహించదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్ర కలని సాకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీలకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్ఫూర్తితో, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. 'తెలంగాణ విజన్-2047' లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ, రాష్ట్ర రైతులను వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా, అత్యంత పారదర్శకంగా ఇప్పటివరకు 67 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ భర్తీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని పేర్కొంటూ.. ఈ నెలలోనే టిజిపిఎస్సి ద్వారా ఇంజినీరింగ్, పీసీబీ, అటవీశాఖ, టౌన్‌ప్లానింగ్, విద్యాశాఖల్లో మరిన్ని కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలోని విద్యావ్యవస్థ బలోపేతానికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. ఇందులో భాగంగా 1,362 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రారంభించాం. ఈ ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఉచితంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ (అల్పాహారం) అందిస్తున్నాం. జూనియర్ కాలేజీ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని త్వరలోనే అమలు చేయబోతున్నాం అని అన్నారు. పేద ప్రజలను అద్దె ఇళ్ల బాధల నుంచి విముక్తి చేయడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. గత 13 నెలల కాలంలో రూ.22 వేల కోట్ల వ్యయంతో 1.25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 3.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, ఈసారి క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని స్పష్టం చేశారు. అలాగే, పేదలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీని కూడా పూర్తి చేశామని వివరించారు. ఈ వేడుకల ముగింపులో భాగంగా, రాష్ట్రంలో ఉత్తమ సేవలు అందించిన పలువురు పోలీసు అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 'విశిష్టసేవా పురస్కారాలను' ప్రదానం చేశారు.
0 Comments