తెలంగాణలోని నల్గొండ జిల్లా కనగల్ మార్కెట్ యార్డులో రోడ్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.83 కోట్లతో చేపట్టనున్న మంచినీటి పథకానికి కూడా భూమిపూజ చేశారు. రాష్ట్రంలో హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. రూ. 13,000 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్యాకేజీలుగా 6,092 కి.మీ. పొడవు గల 441 రహదారులను విస్తరించే కార్యక్రమం పైలాన్ ఆవిష్కరణతో ప్రారంభమైంది. అనంతరం నల్గొండ ఎన్‌జీ కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ ఈ ప్రక్షాళన ప్రక్రియను అడ్డుకోవడానికి కొందరు రాజకీయ స్వార్థంతో ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గబోమని, మూసీ నదీ ప్రక్షాళన చేసి తీరుతానని ఒట్టేసి చెబుతున్నానని పేర్కొన్నారు. దీంతో పాటు డిండి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే సంక్షేమ పథకాల అమలుకు పెద్దపీట వేసిందని రేవంత్ రెడ్డి వివరించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించడంతో పాటు, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ సదుపాయం కల్పిస్తున్నామని గుర్తు చేశారు. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ పేదలపై ఆర్థిక భారం తగ్గించామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేలా నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్యా విధానాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. విద్యార్థుల కోసం ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం నాణ్యమైన భోజనం, సాయంత్రం వేళల్లో స్నాక్స్ అందిస్తున్నామన్నారు. యువతలో నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, ఐటీఐలను అధునాతన టెక్నాలజీ కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు. తమ హయాంలో రికార్డు స్థాయిలో నిరుద్యోగుల కోసం సుమారు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి యువత ఆత్మగౌరవాన్ని కాపాడామని సీఎం తెలిపారు. ప్రజా ప్రభుత్వం సాధించిన ఈ ప్రగతి విజయాలపై అసెంబ్లీ వేదికగా ఏ పార్టీతోనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన సవాల్ విసిరారు. చివరగా నీలగిరి జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులకు స్వయం సహాయక సంఘాల చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేశారు.
0 Comments