ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురం జిల్లా మార్కాపురం-తర్లుపాడు ప్రధాన రహదారిపై సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తికి జిల్లా కలెక్టర్ విజయ సునీత మానవత్వంతో అండగా నిలిచారు. రెండు మోటార్‌సైకిళ్లు ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి రోడ్డు పక్కన పడిఉండగా, కలెక్టరేట్ నుంచి మార్కాపురం పట్టణానికి వెళ్తున్న జిల్లా కలెక్టర్ విజయ సునీత తన వాహనాన్ని వెంటనే ఆపించారు. పరిస్థితిని స్వయంగా పరిశీలించిన ఆమె అత్యవసరంగా 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, గాయపడిన వ్యక్తిని సురక్షితంగా అంబులెన్స్‌లో ఎక్కించి ఆస్పత్రికి తరలించేలా పర్యవేక్షించారు. కలెక్టర్ విజయ సునీత చూపిన సమయస్ఫూర్తి, మానవతా దృక్పథం స్థానికులను ఆకట్టుకుంది. ప్రభుత్వ ఉన్నతాధికారిగా తన బాధ్యతలతో పాటు ఒక ప్రాణాన్ని కాపాడేందుకు వెంటనే స్పందించిన ఆమెను స్థానికులు, ప్రయాణికులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
0 Comments