తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులను 2024, 2025 దావోస్ పర్యటనల్లో భాగంగా సముపార్జించిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇవాళ సభలో దావోస్ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై బీజేపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. మొత్తం 44 ఎంవోయూలను వివిధ కంపెనీలతో కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. ఆయా పెట్టుబడుల గ్రౌండింగ్ వివిధ దశల్లో ఉన్నాయని, ఫలితంగా కొత్తగా 68,150 మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని తెలిపారు. 2024లో 18 ఎంవోయూలతో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు రాగా, 2025లో 26 ఎంవోయూలతో రూ.1,78,950 కోట్లు కలుపుకుని మొత్తం 44 ఎంవోయూలతో రూ.2,19,182 కోట్ల పెట్టుబడులు వచ్చాయని అన్నారు. అయితే, దావోస్ పర్యటనల్లో భాగంగా రూ.81,800 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎంవోయూలు కుదుర్చుకున్న 6 కంపెనీలకు ఇప్పటికే భూములు కేటాయించామని చెప్పారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి రూ.1,540 కోట్ల ఆదాయం సమకూరిందని వెల్లడించారు. ఇక నిజామాబాద్ ఐటీ టవర్ మొత్తం 681 సీట్ల సామర్థ్యం ఉందని, ప్రస్తుతం అక్కడ 11 కంపెనీలు 276 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రస్తావించారు.
0 Comments