ఈరోజు పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక సూచనలు చేసింది. రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్‌గా కాకుండా, ఆర్టికల్ 131 ప్రకారం సివిల్ సూట్‌గా దాఖలు చేయాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం తెలిపింది. కోర్టు సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ, న్యాయస్థానం ఆదేశాల ప్రకారం రెండు రోజుల్లో సివిల్ సూట్ దాఖలు చేస్తామని ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకుంటామని, రాష్ట్ర నీటి హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడుతామని ఆయన తేల్చిచెప్పారు. ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మంత్రి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన 484.5 టీఎంసీల నీటి కంటే ఎక్కువగా వాడుకునే ప్రయత్నం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. ఈ విషయంపై తాము ఇప్పటికే కోర్టులో అభ్యంతరాలను తెలిపామని అన్నారు. గతంలో ఇచ్చిన 'స్టాప్ వర్క్ ఆర్డర్'ను కూడా ఏపీ సర్కారు అమలు చేయడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంలో అనుమతులు లేకుండానే ముందుకు వెళ్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి, కృష్ణా బోర్డులతో పాటు అపెక్స్ కౌన్సిల్ అనుమతి కూడా తీసుకోలేదని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు అసలు రూపానికి అదనంగా ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేదని తాము బలంగా వాదించినట్లు ఆయన వివరించారు. డిజైన్ చేసిన దానికంటే ఒక్క చుక్క నీటిని కూడా అదనంగా వాడుకోనివ్వమని స్పష్టం చేశారు. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రభుత్వం చెబుతోంది. కోర్టు సూచనల మేరకు సివిల్ సూట్ ద్వారా చట్టపరమైన పోరాటం కొనసాగించేందుకు తెలంగాణ సిద్ధమైంది. ఈ వివాదంపై రానున్న రోజుల్లో న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.
0 Comments