ఆంధ్రప్రదేశ్ లో రాగల మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణ పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండటం, అలాగే ఉత్తర కోస్తా నుంచి మధ్య మహారాష్ట్ర వరకు ఒక ద్రోణి కొనసాగుతుండటంతో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర-దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లోనూ, యానాం ప్రాంతంలోనూ ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ ప్రాంతాల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని, కొన్ని చోట్ల గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, గాలి వేగం 30-50 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు. రాగల ఐదు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎటువంటి మార్పు ఉండదని అధికారులు స్పష్టం చేశారు.