దేశీయ, అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తున్న తెలంగాణ రైజింగ్‌ విజన్‌ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా పోస్టు

తెలంగాణ రైజింగ్‌ విజన్‌ దేశీయ, అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి ద్వారా పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణలో శిక్షణ పొందిన యువతకు ప్రముఖ బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయని వివరించారు. ఈ మేరకు సీఎం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఇటీవల జరిగిన నియామకాల్లో ష్నైడైర్‌ ఎలక్ట్రిక్‌ సంస్థలో 47 మంది యువకులు ఉద్యోగాలు పొందారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పుణెలోని టాటా మోటార్స్ యూనిట్‌లో 36 మంది విద్యార్థులు ఎంపికయ్యారని చెప్పుకొచ్చారు. అలాగే ఫాక్స్‌కాన్‌ సంస్థకు చెందిన ఆపిల్‌ ఐఫోన్‌ విభాగంలో 14 మంది మహిళా విద్యార్థినులు ఉద్యోగాలు సాధించారని తెలిపారు. బ్లూ కాలర్‌ ఉద్యోగాల రంగంలో తెలంగాణను దేశానికే కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ అందిస్తూ, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో అందుబాటులో ఉన్న నైపుణ్యవంతమైన మానవ వనరులు, పారిశ్రామిక అనుకూల విధానాలు, మెరుగైన మౌలిక వసతులు ప్రపంచస్థాయి సంస్థలను ఆకర్షిస్తున్నాయని సీఎం తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశముందని సీఎం రేవంత్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org