Ad Code

తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా ఇకపై మధ్యాహ్న భోజన పథకాన్ని  అమలు చేసేందుకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో పాటు స్కూళ్లతో సమానంగా జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు సైతం ప్రతిరోజూ ఉదయం అల్పాహారం, పాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే రాబోయే 2027 గోదావరి పుష్కరాల పనుల కోసం రూ.1,000 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలపడమే కాకుండా, అందులో మొదటి విడత కింద రూ.300 కోట్లు తక్షణమే మంజూరు చేస్తూ పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో కొత్త పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా గంగాధరలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 20 రెగ్యులర్ టీచింగ్ పోస్టులు, ఆరు నాన్-టీచింగ్ పోస్టులతో పాటు అవుట్‌సోర్సింగ్ పద్ధతిన మరో మూడు పోస్టుల నియామకాలకు క్లియరెన్స్ ఇచ్చింది. వీటితో పాటు మహబూబాబాద్ జిల్లా కే.సముద్రం ఏరియాలో కొత్తగా ఏర్పాటు చేయబోయే అగ్నిమాపక కేంద్రం నిర్వహణ కోసం మరో 18 పోస్టుల మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

Post a Comment

0 Comments

Close Menu