టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం ప్రకటించిన అనంత్ అంబానీ

తిరుమల క్షేత్రంలో పర్యావరణ పరిరక్షణకు, పశు సంరక్షణకు ఊతమిచ్చేలా అనంత్ అంబానీ రూ.27.5 కోట్ల భారీ విరాళంఇచ్చారు. ఆదివారం వేకువజామున తిరుమలకు చేరుకుని తలనీలాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు, వేద పండితులు ఆయనకు శేషవస్త్రం కప్పి, వేదాశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలను ఘనంగా అందజేశారు. దర్శనం ముగించుకున్న అనంతరం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో సమావేశమైన అనంత్ అంబానీ తిరుమల రవాణా వ్యవస్థను మరింత పర్యావరణహితంగా మార్చేందుకు ఏకంగా రూ.27.5 కోట్ల విలువైన భారీ విరాళాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా టీటీడీకి 25 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను బహుమతిగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఘాట్ రోడ్లలో కాలుష్యాన్ని తగ్గించి భక్తులకు సురక్షితమైన, ప్రశాంతమైన ప్రయాణాన్ని అందించడంలో ఈ బస్సులు కీలక పాత్ర పోషించనున్నాయి. వాటి దీర్ఘకాలిక నిర్వహణ బాధ్యతను కూడా రిలయన్స్ సంస్థే స్వీకరించడం విశేషం. ఈ 25 ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు అవసరమైన 50 మంది డ్రైవర్ల జీతభత్యాలను తామే భరిస్తామని అనంత్ అంబానీ ప్రకటించారు. దీనివల్ల టీటీడీపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఉంటుంది. అంతేకాకుండా, ఈ వాహనాల రీఛార్జింగ్ కోసం కొండపై అత్యాధునిక చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సైతం రిలయన్స్ సంస్థ పూర్తి సాంకేతిక, ఆర్థిక సహకారాన్ని అందించేందుకు అంగీకరించింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వంతారా ప్రాజెక్ట్ తరహాలోనే తిరుమల గోశాలను కూడా సర్వాంగ సుందరంగా ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, మెరుగైన సంరక్షణ పద్ధతులు, అంతర్జాతీయ స్థాయి పశువైద్య సేవలతో ఈ గోశాలను మోడల్ ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దేందుకు టీటీడీతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org