Ad Code

ఈ ఏడాది మా దేశం తిరిగి వెళ్తా !

ఇండియాలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ ఏడాది ఎలాగైనా తన స్వదేశం తిరిగి వెళ్తానని ప్రకటించారు. ఒకవైపు ఆమెకు ప్రాణహాని ఉన్నా, మరణశిక్ష విధించాలని డిమాండ్లతోపాటు ఆమె పార్టీపై నిషేధం ఉన్నా తను మాత్రం ఈ ఏడాది బంగ్లాదేశ్ తిరిగి వెళ్తానని చెప్పారు. ఆమె పార్టీ అవామీ లీగ్ ఈ ఏడాది జూన్ 23న 77 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇండియాలోని ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. ''నేను బంగ్లాదేశ్ తిరిగి వెళ్లడం నా వ్యక్తిగతమైన లక్ష్యం కోసం కాదు. అది బంగ్లాదేశ్ ప్రజల రాజకీయ ఆకాంక్షల కోసం. అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం కోసం. విముక్తి కోసం జరిగిన పోరాట స్ఫూర్తి కోసం. చట్టాన్ని పరిరక్షించేందు కోసం నేను వెళ్తా. నేను అధికారం కోసం రాజకీయాలు చేయను. బంగ్లాదేశ్ ప్రజల సంక్షేమం కోసం, వారి ఆకాంక్షల్ని నెరవేర్చడం కోసం, బంగ్లా జాతిపిత బంగబంధు షేక్ ముజిబర్ రహమాన్ కలలుగన్న సోనార్ బంగ్లాను సాధించడం కోసమే రాజకీయాలు చేస్తా'' అన్నారు. తనకు అక్కడి కోర్టు మరణ శిక్ష విధించడంపై కూడా షేక్ హసీనా స్పందించారు. ఆ తీర్పు రాజకీయ ప్రేరేపితం, అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం అని ఆమె అన్నారు. బంగ్లాదేశ్ న్యాయవ్యవస్థ రాజకీయ వేధింపులు, ప్రతీకార చర్యలకు కేంద్ర బిందువుగా మారిందని హసీనా ఆవేదన వ్యక్తం చేశారు. తన పార్టీ అయిన అవామీ లీగ్ నేతలపై ప్రతీకార చర్యలు తీసుకుంటూ, నాయకుల్ని లేకుండా చేస్తున్నారని విమర్శించారు. చావుకు తాను భయపడనన్నారు. 1975లోనే తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల్ని కోల్పోయానన్నారు. ఆ తర్వాత తనపై కూడా గ్రెనేడ్ దాడి జరిగిందన్నారు. తనపై ఎన్నో కుట్రలు జరిగాయని, వాటన్నింటినీ దాటుకుని బంగ్లాదేశ్ ప్రజల కోసం నిలబడ్డానని చెప్పారు. ఐదుసార్లు దేశ ప్రజలు తనను ప్రధానిగా ఎన్నుకున్నారని గుర్తు చేశారు. తన జీవితం మొత్తాన్ని బంగ్లాదేశ్ కోసం, అవామీ లీగ్ కోసం ధారపోశానని చెప్పుకొచ్చారు. తనకు ఎదురయ్యే ఇబ్బందులు అన్నింటినీ దాటుకుని బంగ్లాదేశ్ వెళ్తానని షేక్ హసీనా స్పష్టం చేశారు. తన పార్టీ అవామీ లీగ్ ఒక బలమైన రాజకీయ శక్తి అని, త్వరలోనే తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు సందర్భంగా అప్పటి ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి ఇండియా చేరుకున్నారు. రెండేళ్లకుపైగా ఆమె ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. ఇదే సమయంలో హసీనాను అక్కడి పాలకులు, కోర్టులు దేశం నుంచి బహిష్కరించాయి. ఆమెకు మరణశిక్ష కూడా విధించాయి.

Post a Comment

0 Comments

Close Menu