ఒక చెరకు రసం బండి వద్ద ఉన్న సాధారణ ధరల పట్టిక వెనుక ఉన్న వ్యాపార ఆలోచనా విధానాన్ని వివరిస్తూ లింక్డ్‌ఇన్ లో పెట్టిన ఒక పోస్ట్, ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రముఖ స్టార్టప్ సంస్థ ‘ఎంటౌరేజ్’ వ్యవస్థాపకురాలు అనన్య నారంగ్ ఇటీవల తన లింక్డ్‌ఇన్ ఖాతాలో ఒక చెరకు రసం విక్రేతకు సంబంధించిన ధరల బోర్డు ఫోటోను పంచుకున్నారు. ఆ బోర్డుపై ఇలా రాసి ఉంది. చెరకు రసం ధరలు ఐస్ లేకుండా రూ. 30, ఐస్‌తో రూ. 25, అర గ్లాసు రూ. 20. ఈ ఫోటోను షేర్ చేస్తూ “చాలా మంది స్టార్టప్ వ్యవస్థాపకుల కంటే ఈ రోడ్డు పక్కన చెరకు రసం అమ్మే వ్యక్తి ‘యూనిట్ ఎకనామిక్స్’ను మరింత బాగా అర్థం చేసుకున్నాడు” అని ఆమె క్యాప్షన్‌లో ప్రశంసించారు. మొదట చూసినప్పుడు ఈ ధరల విధానం కాస్త వింతగా, సూటిగా అనిపించవచ్చు. కానీ దీని వెనుక ఉన్న ఆచరణాత్మక వ్యాపార ఆలోచనను నెటిజన్లు ఎత్తి చూపుతున్నారు. గ్లాసులో ఐస్ ముక్కలు వేయడం వల్ల రసం పరిమాణం తగ్గుతుంది. అంటే తక్కువ రసంతోనే గ్లాసు నిండిపోతుంది. అందుకే ఐస్‌తో ఇచ్చే రసం ధర రూ. 25 గా పెట్టాడు. ఐస్ లేకుండా కేవలం స్వచ్ఛమైన చెరకు రసం మాత్రమే కావాలనుకునే వారికి ఎక్కువ రసం పోయాల్సి వస్తుంది. కాబట్టి దానికి రూ. 30 వసూలు చేస్తున్నాడు. ఐస్, పరిమాణం (అర గ్లాసు రూ. 20) ఆధారంగా వేర్వేరు ధరలను అమర్చడం వల్ల, విక్రేత తన ఖర్చులను మెరుగ్గా నిర్వహిస్తూనే.. తక్కువ బడ్జెట్ ఉన్న వారితో సహా అన్ని రకాల వినియోగదారులను ఆకర్షించగలుగుతున్నాడు. ఈ ధరల నిర్ణయం లాంఛనప్రాయమైన వ్యాపార విద్య కంటే, అనుభవం ఆధారంగానే రోజువారీ వీధి వ్యాపారులు ఎంత తెలివైన నిర్ణయాలు తీసుకుంటారో సూచిస్తోంది. తరగతి గదులు లేదా కార్పొరేట్ బోర్డ్‌రూమ్‌లకు బదులుగా నిజ జీవిత అనుభవం నుంచే గొప్ప వ్యాపార పాఠాలు వస్తాయని ఈ పోస్ట్ నిరూపించింది. ఈ క్రేజీ పోస్ట్‌పై సోషల్ మీడియా వినియోగదారులు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఒక వినియోగదారుడు, “అతను చాలా నిజాయితీపరుడు. ఐస్ వేస్తే రసం తగ్గుతుందని ముందే చెప్పి రేటు తగ్గించాడు, దీనిపై మనం ఫిర్యాదు చేయలేం” అని వ్యాఖ్యానించారు. మరొకరు, “చిన్న వ్యాపారాలు వినియోగదారుల మైండ్ సెట్‌ను చాలా బాగా అర్థం చేసుకుంటాయి” అని పేర్కొన్నారు. “నిజమైన బిజినెస్ పాఠాలు ఇవే.. మనం ఇతని నుండి ఎంబీఏ క్లాసులు నేర్చుకోవాలి” అని మూడో వినియోగదారుడు ఫన్నీగా జోడించారు.
0 Comments