ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటలో జరిగిన చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ అయోధ్య రామాలయ నిర్మాణానికి సేకరించిన నిధులలో రూ. 200 కోట్ల మేర అవినీతి జరిగిందని, ప్రజల నుండి సేకరించిన రూ. 1400 కోట్ల విరాళాలకు సరైన లెక్కలు లేవని ఆరోపించారు. తిరుపతి లడ్డు కల్తీపై గగ్గోలు పెట్టిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అయోధ్య నిధుల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తూ, ఈ అంశంపై సిట్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 20 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధుల కోత విధిస్తూ, నిబంధనలను మారుస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. పాత పద్ధతిలోనే పథకాన్ని కొనసాగించాలని కోరారు. అలాగే, అమరావతిని అందరికీ సమాన హక్కు ఉండేలా 'ఫ్రీ జోన్'గా ప్రకటించాలని, గత ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లను తక్షణమే పేదలకు పంపిణీ చేయాలని మంత్రి నారాయణను నిలదీశారు రాష్ట్రంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వెలిశాయని, ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటూ మద్యం ద్వారా ఆదాయం రాబట్టాలని చూడటం దారుణమని ఆరోపించారు. నీట్, టెట్ పరీక్షా పత్రాల లీకేజీల వల్ల 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 'ఎడ్యుకేషన్ మాఫియా' రాజ్యమేలుతోందని విమర్శించారు. దళితులు, ఆదివాసీలు మరియు ప్రతిపక్ష కార్యకర్తలపై దాడులు, పోలీస్ లాకప్‌లలో అనుమానాస్పద మరణాలు రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి, నాయకులు మోదుగుల పార్థసారథి, సూళ్లూరుపేట మండల కార్యదర్శి రమణయ్య, పట్టణ కార్యదర్శి ఆనంద్, సహాయ కార్యదర్శులు బాలు, లక్ష్మి, వెంకట కృష్ణయ్య, చంచమ్మ, ఎఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి నాగేంద్రబాబు, శ్రీనివాసులు, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
0 Comments