Ad Code

తెలంగాణలో కమలం వికసించే రోజు ఎంతో దూరంలో లేదు !

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మూడు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎంతో సమయం లేదన్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన తొమ్మిది జిల్లాల బీజేపీ కార్యాలయాలను నితిన్ నబీన్ ప్రారంభించారు.రంగారెడ్డి జిల్లా గ్రామీణ కార్యాలయాన్ని ఆయన స్వయంగా ప్రారంభించగా, మిగిలిన ఎనిమిది జిల్లాల కార్యాలయాలను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ జిల్లా కార్యాలయాలు కేవలం భవనాలు మాత్రమే కావని, పార్టీ లక్ష్యాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే పవిత్ర కేంద్రాలని అభివర్ణించారు. దశాబ్దాలుగా పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ, ఎన్నో త్యాగాలు చేసిన సీనియర్ నేతలను, మాజీ జిల్లా అధ్యక్షులను, క్షేత్రస్థాయి కార్యకర్తలను ఈ వేదికపై ఆయన ప్రత్యేకంగా అభినందించి వారికి కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ "దేశం మొదటిది, పార్టీ తర్వాతి స్థానం, స్వార్థం చివరిది" అనే నినాదంతో, సిద్ధాంతంతో పనిచేస్తుందని నితిన్ నబీన్ స్పష్టం చేశారు. ఈ సిద్ధాంతమే ప్రతి కార్యకర్తను ప్రజా సేవ వైపు నడిపిస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సాగుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను తెలంగాణలోని ప్రతి ఇంటికీ చేరవేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. కేవలం ఎన్నికల కోసమే కాకుండా నిరంతరం ప్రజల కష్టసుఖాల్లో భాగం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై నితిన్ నబీన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ సర్కార్‌ను గద్దె దించేందుకు బీజేపీ సైనికులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. "తెలంగాణలో కమలం వికసించే రోజు ఎంతో దూరంలో లేదు.. ఈ అవినీతి, అరాచక పాలనపై పోరాడటానికి మా కార్యకర్తలు నడుం బిగించారు" అని హెచ్చరించారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి, తెలంగాణ భవిష్యత్తును మార్చేందుకు నడుం బిగించాలని ఆయన ఆకాంక్షించారు.

Post a Comment

0 Comments

Close Menu