ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధిని, హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చే చారిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. నగరానికి కొత్త జీవం పోసేలా, పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోందన్నారు. భూ సేకరణ, పునరావాసం తదితర అంశాలపై సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఉన్నతాధికారులతో సోమవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మూసీ నదిని పునరుజ్జీవింపజేసి దాన్ని పర్యాటకం, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి కేంద్రంగా మార్చాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టి అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ఒక అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాదని, ఇది భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన, పర్యావరణహితమైన జీవన వాతావరణాన్ని అందించే సంకల్పమని వివరించారు. మూసీ నది కాలుష్యంతో ఎన్నో దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వరదల సమయంలో పరివాహక ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుందని తెలిపారు. వరద నియంత్రణ, నీటి శుద్ధి, పచ్చదనం పెంపు, రోడ్లు, పార్కులు, వాక్‌వేలు, వినోద కేంద్రాలు ఏర్పాటు ద్వారా మూసీ పరివాహక ప్రాంతాలను సరికొత్త జీవన కేంద్రాలుగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టు మూసీ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం ముందుకు సాగుతోందని గుర్తు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో పేదల జీవితాలు దెబ్బతినకుండా ప్రతి నిర్ణయం మానవీయ కోణంలోనే తీసుకుంటామని స్పష్టం చేశారు. భూ సేకరణ ప్రక్రియలో మానవీయ కోణంలో నిర్ణయాలు ఉండాలని అధికారులకు సూచించారు. ఇళ్లు కోల్పోయే కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయించాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించి తక్షణమే అమలు చేయాలని ఆదేశించారు. భూములు కోల్పోయే వారికి చట్టబద్ధమైన పరిహారం, అవసరమైన పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం రాజీ పడబోదని మంత్రి స్పష్టం చేశారు.సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్.లోకేశ్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఎండీ ఈ.వి.నర్సింహారెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
0 Comments