ఐఫోన్ 18 సిరీస్ లో సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్న యాపిల్
యాపిల్ రాబోయే ఐఫోన్ 18 సిరీస్ విషయంలో సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలోనే అన్ని మోడళ్లను ఒకేసారి విడుదల చేసే సంప్రదాయానికి యాపిల్ స్వస్తి పలకనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. యాపిల్ కేవలం తన హై-ఎండ్ ప్రో మోడళ్లను మాత్రమే ఎప్పటిలాగే సెప్టెంబర్ నెలలో మార్కెట్లోకి తీసుకురానుంది. అయితే, బేస్ లేదా స్టాండర్డ్ వేరియంట్లను మాత్రం వచ్చే ఏడాది మార్చి నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ సరికొత్త వ్యూహం వెనుక మార్కెట్ డిమాండ్, ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్ దాగి ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. లీకైన వివరాల ప్రకారం, 2027 మొదటి సగభాగంలో రాబోయే స్టాండర్డ్ ఐఫోన్ 18, నాన్-ఫ్లాగ్‌షిప్ మోడల్ ఐఫోన్ 18ఈ స్మార్ట్‌ఫోన్లు ఏకంగా 9జీబీ డీరామ్ తో రాబోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడళ్లలోని 8జీబీ ర్యామ్‌తో పోలిస్తే ఇది ఒక మోస్తరు అప్‌గ్రేడ్ మాత్రమే. ఐఓఎస్ 27 ఆపరేటింగ్ సిస్టమ్‌లో రాబోయే సరికొత్త యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను ఈ ఫోన్లు మరింత స్మూత్‌గా రన్ చేయడానికి యాపిల్ ఈ అదనపు మెమొరీని జత చేయబోతోంది. ఇందులో ఆరు 1.5జీబీ డీరామ్ డైస్ (1.5GB x 6 dies) సహాయంతో మొత్తం 9జీబీ ర్యామ్‌ను సెట్ చేయబోతున్నారు, ఇది యాపిల్ చరిత్రలోనే ఒక వింతైన మెమొరీ కాన్ఫిగరేషన్ కానుంది. ఈ రెండు రాబోయే బేస్ మోడల్ ఐఫోన్లలో యాపిల్ కంపెనీ సరికొత్త ఏ20 చిప్‌సెట్‌ను ఉపయోగించబోతోంది. ఈ ప్రాసెసర్‌ను ప్రపంచ ప్రసిద్ధ చిప్ తయారీ సంస్థ టీఎస్‌ఎమ్‌సీ అత్యంత అధునాతన 2ఎన్ఎమ్ గేట్-ఆల్-అరౌండ్ ప్రాసెస్ టెక్నాలజీతో తయారు చేయబోతోంది. దీనివల్ల ఫోన్ పర్ఫార్మెన్స్ వేగం పుంజుకోవడమే కాకుండా, బ్యాటరీ లైఫ్, ఎఫిషియెన్సీ కూడా మునుపటి కంటే చాలా అద్భుతంగా మెరుగుపడనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాస్క్‌లను వేగంగా చేయడానికి ఈ నయా టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. యాపిల్ టాప్-ఆఫ్-ది-లైన్ మోడళ్లయిన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఫోన్లలో యథావిధిగా 12జీబీ భారీ ర్యామ్‌ను కొనసాగించనున్నారు. వీటితో పాటు యాపిల్ చరిత్రలోనే మొదటిసారిగా రాబోతున్న సరికొత్త ఫోల్డబుల్ ఫోన్ 'ఐఫోన్ ఆల్ట్రా' కూడా 12జీబీ ర్యామ్‌తోనే మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ మూడు ప్రీమియం హ్యాండ్‌సెట్లలో అత్యంత పవర్‌ఫుల్ ఏ20 ప్రో చిప్‌సెట్‌ను యాపిల్ అమర్చబోతోంది. అయితే యాపిల్ తెచ్చే కఠినమైన ఏఐ నిబంధనల ప్రకారం పూర్తి స్థాయి ఫీచర్లు 9జీబీ ర్యామ్ ఉన్న బేస్ మోడల్స్‌లో పని చేస్తాయా లేదా అనేది ఇంకా సస్పెన్స్‌గానే మిగిలింది.
Comments
Post a Comment