ఛత్తీస్ గడ్ లోని జాంజగీర్-చాంపా జిల్లాలోని కోస్మాండా గ్రామానికి చెందిన ముస్కాన్ ఈ నెల 23వ తేదీ రాత్రి తన పెళ్లి ఊరేగింపులో ఊహించని పరిణామం ఎదుర్కొన్నారు. కారు నుంచి దిగిన వరుడు తీవ్రంగా మద్యం సేవించి నిలబడలేని స్థితిలో ఉన్నాడని తెలిసి, ఆమె సహించలేకపోయింది. చిన్న వయసులోనే తండ్రిని తాగుడు కారణంగా కోల్పోయిన ముస్కాన్, ఇలాంటి బాధను మళ్లీ ఎదుర్కోవాలని భావించలేదు. ఫుల్ గా మద్యం సేవించిన వరుడిని చూసి షాక్ అయిన వధువు వరుడి వద్దకు వెళ్లి చెంపదెబ్బ కొట్టి, "నిన్ను నేను పెళ్లి చేసుకోను" అని స్పష్టంగా చెప్పేసింది. ఆమె ఈ నిర్ణయానికి కుటుంబ సభ్యులంతా పూర్తి మద్దతు ఇచ్చారు. దీంతో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం తీవ్రమైంది. పరిస్థితి చేజారి ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో కొంతమంది గాయపడ్డారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకొని వరుడి వైపు వారిని వెనక్కి పంపించారు. జిల్లా ఎస్‌పి విజయ్‌కుమార్ పాండే ముస్కాన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఆమెకు రూ.5,000 గౌరవ వేతనంతో కౌన్సెలర్ పదవి ఇచ్చి గౌరవించారు. జిల్లా కలెక్టర్ జనమేజయ్ మహోబే కూడా ఆమెను కలిసి ప్రశంసించారు. పదో తరగతి వరకు చదివిన ముస్కాన్ చదువు కొనసాగించేందుకు సహాయం చేస్తామని, కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
0 Comments