గుజరాత్‌లోని గాంధీనగర్‌లో భారత్ ట్యాక్సీ సేవలను కేంద్ర మంత్రి అమిత్ షా అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ ట్యాక్సీని అడ్డుకునేందుకు కొన్ని ప్రైవేట్ క్యాబ్ సేవల సంస్థలు పోటీకి దిగుతున్నాయని ఆరోపించారు. భారత్ ట్యాక్సీ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయంటూ వస్తున్న వార్తలు పూర్తిగా తప్పుదోవ పట్టించేవేనని అమిత్ షా స్పష్టం చేశారు. తమ లక్ష్యం ఇతర కంపెనీలకు నష్టం కలిగించడం కాదని.. డ్రైవర్లు, ప్రయాణికులకు న్యాయమైన సేవలు అందించడమేనని చెప్పారు. భారత్ ట్యాక్సీ విజయవంతం కాకుండా అడ్డుకునేందుకే కొన్ని సంస్థలు తాత్కాలికంగా తక్కువ ఛార్జీలు, డ్రైవర్లకు అధిక కమిషన్లు ఇస్తున్నాయని ఆరోపించారు. కొన్ని ప్రైవేట్ క్యాబ్ సంస్థలు మొదట నష్టాలను భరిస్తూ మార్కెట్‌లో పోటీదారులను తొలగించి, ఆ తర్వాత తమ ఇష్టానుసారం ఛార్జీలు నిర్ణయించే విధానాన్ని అనుసరిస్తున్నాయని అమిత్ షా అన్నారు. అయితే భారత్‌లో సహకార భావన ఎంతో బలంగా ఉందని, ఇలాంటి వ్యూహాలు ఎక్కువ కాలం పనిచేయవని ఆయన అన్నారు. భారత్ ట్యాక్సీ సేవలను ప్రస్తుతం గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, ద్వారక, సోమనాథ్ మొదలైన మొత్తం 14 ప్రధాన నగరాల్లో ప్రారంభించారు. ఈ సేవలు టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఫోర్ వీల్ ట్యాక్సీలు అనే మూడు విభాగాల్లో అందుబాటులో ఉంటాయి. ఇది దేశంలోనే తొలి సహకార సంఘాల ఆధ్వర్యంలో నడిచే, డ్రైవర్ల యాజమాన్యంలోని రైడ్-హైలింగ్ ప్లాట్‌ఫామ్. ఇందులో డ్రైవర్ల నుంచి ఎలాంటి కమిషన్ వసూలు చేయరు. ప్రయాణికుడు చెల్లించిన మొత్తం ఛార్జీ నేరుగా డ్రైవర్‌కే అందుతుంది. దీంతో డ్రైవర్ల ఆదాయం పెరగడంతో పాటు, వారికి ఆర్థిక భద్రత కూడా లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఏడాది జూలై 31లోపు నాగ్‌పూర్, పుణే, ముంబై, లక్నో, చండీగఢ్, జైపూర్, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో సేవలు ప్రారంభిస్తామని, అలాగే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 500కు పైగా నగరాలు, పట్టణాలకు భారత్ ట్యాక్సీ సేవలను విస్తరిస్తామని ప్రకటించారు. 'సహకార్ సే సమృద్ధి' అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన నినాదాన్ని రవాణా రంగంలో కూడా విజయవంతం చేయాలన్నదే తమ లక్ష్యమని అమిత్ షా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇదే సహకార నమూనాను మరిన్ని రంగాల్లో కూడా విస్తరిస్తామని వెల్లడించారు.
0 Comments