Ad Code

13 ఏళ్ల బాలికను విక్రయించిన రిక్షా కార్మికుడు : 30 మందికి పైగా లైంగిక దాడి

రాజస్థాన్‌లోని శ్రీ గంగనగర్‌లో 13 ఏళ్ల మైనర్ బాలికపై ఐదు రోజుల పాటు వేర్వేరు హోటళ్లలో 30 మందికి పైగా మృగాళ్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం సదరు బాలిక ఇంట్లోంచి కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో ఒక రిక్షా కార్మికుడు ఆ బాలికను శ్రీ గంగనగర్‌లోని ఒక హోటల్ యజమానికి విక్రయించాడు. అక్కడి నుండి బాలిక నరకం మొదలైంది. పలువురు హోటల్ నిర్వాహకులు పరస్పర సహకారంతో ఆ మైనర్‌ను ఐదు రోజుల పాటు వివిధ హోటళ్లకు మారుస్తూ క్రూరంగా లైంగిక వేధింపులకు గురిచేశారు. ఈ దారుణాన్ని బయటకు పొక్కకుండా అణచివేయడానికి కూడా నిందితులు ప్రయత్నించారు. నిరంతర అత్యాచారాల వల్ల బాలిక తీవ్ర శారీరక నొప్పితో బాధపడిన ప్రతిసారీ, నిందితులు ఆమెతో బలవంతంగా మద్యం తాగిస్తూ నరకాన్ని చూపించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ దారుణ ఘటన వెలుగులోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పర్యాటక ప్రాంతం కాకపోయినప్పటికీ, శ్రీ గంగనగర్‌లో 150కి పైగా అక్రమ హోటళ్లు నడుస్తున్నాయని, వాటన్నింటినీ తక్షణమే మూసివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు హోటల్ యజమానులను, మేనేజర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై రాజకీయంగానూ తీవ్ర దుమారం రేగుతోంది. నిందితులతో పాటు వారికి సహకరించిన రిక్షా కార్మికుడిని, హోటల్ యజమానులను కఠినంగా శిక్షించాలంటూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టింది. కరంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రూపేందర్ సింగ్ కున్నార్ ఈ ఆందోళనల్లో పాల్గొని, నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. స్థానిక పోలీసుల, అధికారుల వైఫల్యం వల్లే ఈ అరాచకం జరిగిందని మండిపడిన ఆయన, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను సస్పెండ్ చేయాలని, బాధిత బాలికకు త్వరితగతిన న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Post a Comment

0 Comments

Close Menu