తెలంగాణలోని ములుగు జిల్లా దేవాదుల ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిమాట్లాడుతూ గత పదేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, బీఆర్ఎస్ వైఫల్యాల వల్లే ఇప్పుడు జలాల రాజకీయం నడుస్తోందని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయలేని పరిస్థితి ఏర్పడిందని, కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారినా.. రాష్ట్రంలో వరి దిగుబడి మాత్రం తగ్గలేదని రేవంత్ రెడ్డి వివరించారు. కేసీఆర్, హరీశ్ రావుల తప్పులను ప్రజలు గమనించే గత ఎన్నికల్లో వారికి తగిన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. పదేళ్లలో ఏం జరిగింది, తమ ప్రభుత్వం ఏం చేస్తోందనే దానిపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చిస్తామన్నారు. నీటి జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తోందన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ అసంబద్ధమైన మాటలని కొట్టిపారేశారు. ఎన్నికల సమయంలోనే రాజకీయం ఉండాలని, ప్రజల ప్రయోజనాలు, నీళ్ల విషయంలో రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. ఓటు వేసిన ప్రజలనే తప్పు పట్టేలా బీఆర్ఎస్ నేతలు వ్యవహరించడం విచారకరమని, ప్రజల తీర్పును గౌరవించి విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు.
0 Comments